అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట‌ క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ త‌గ‌లబోతోందా? ఇన్నాళ్లూ సీనియ‌ర్ల తీరుపై అసంతృప్తితో ర‌గిలిపోతున్న మంత్రి భూమా అఖిల‌ప్రియ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నారా? న‌ంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌లో రచ్చ కెక్కిన విభేదాలు మ‌రింత‌. తీవ్ర‌మ‌య్యాయా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. టీడీపీకి అఖిల‌ప్రియ గుడ్‌బై చెప్ప‌బోతున్నార‌నే చ‌ర్చ అటు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల‌ను కుదిపేస్తోంది. త‌న తండ్రి అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు మొద‌లు.. ఇన్నేళ్ల‌ పాటు సీనియ‌ర్ల విమ‌ర్శ‌లు, అవ‌మానాలు ఎదుర్కొంటూ వ‌చ్చిన ఆమెలో అస‌హ‌నం ప‌తాక స్థాయికి చేరింద‌ని తెలుస్తోంది. పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించినా.. ఆమె డుమ్మా కొట్ట‌డానికి `సంచ‌ల‌న‌` నిర్ణ‌య‌మే కార‌ణ‌మని తెలుస్తోంది. ఇక రేపోమాపో ఆమె సైకిల్ దిగిపోవ‌చ్చ‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు జారీచేయ‌డంతో చంద్ర‌బాబు.. చ‌ర్య‌లు చేప‌ట్టారు. 


క‌ర్నూలు జిల్లాలో టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు ఊహించ‌ని ప‌రిస్థితుల‌కు దారితీస్తున్నాయి. ఇప్ప‌టికే ఏవీ సుబ్బారెడ్డితో అఖిల‌ప్రియ‌కు పొలిటిక‌ల్ వార్ జ‌రుగుతుం డ‌గానే.. కార్డ‌న్ సెర్చి రూపంలో మ‌రోకొత్త ఉప‌ద్ర‌వం వచ్చి ప‌డింది. అఖిల దూకుడికి క‌ళ్లెం వేసేందుకు ఏవీ సుబ్బారెడ్డి.. ఆయ‌న్ను దెబ్బ‌కొట్టేందుకు అఖిల వ‌ర్గం.. వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. వీటిని ప‌రిష్క‌రించేందుకు సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగి.. రెండు వ‌ర్గాల‌తో మాట్లాడి, స‌మ‌ష్టిగా ప‌నిచేయాల‌ని సూచించినా, హెచ్చ‌రించినా ప‌రిస్థితిలో మాత్రం మార్పు రాలేద‌నే విష‌యం తెలిసిందే! ఇదే స‌మ‌యంలో అఖిల‌ప్రియ అనుచ‌రులు ఇళ్ల‌ల్లో  స‌మా చారం లేకుండా కార్డ‌న్ సెర్చ్ నిర్వ‌హించ‌డంతో ఆమె మ‌రింత మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. ఈ  ఎపిసోడ్ త‌ర్వాత ఆమె గ‌న్‌మెన్ల‌ను ఎస్కార్ట్‌ను తిర‌స్క‌రించారు. అనంత‌రం ఆమె ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.  


కొద్ది రోజులుగా పార్టీ అధిష్ఠానంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఆమె.. ఇప్పుడు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, ఇందులో భాగంగానే పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని జిల్లా నాయ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆమె `ప్ర‌జ‌లే నాకు శ్రీరామ ర‌క్ష` అంటూ కామెంట్ చేయ‌డం ఇందులో భాగ‌మేన‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వంపై మాత్రం ఆమెకు కోపం త‌గ్గ‌లేదు. గౌర‌వం త‌గ్గింద‌ని అభిప్రాయాన్ని ఆమె స‌న్నిహితుల వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కూడా ఆమెను పిలిచి మాట్లాడ‌లేదు. దీంతో ఆమెలో మ‌రింత కోపం గూడుక‌ట్టుకుందట‌. సీఎం చంద్ర‌బాబు క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించినా హాజ‌రుకాక‌పోవ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.  దీంతో ఆమె పార్టీ వీడుతున్నార‌నే అభిప్రాయం  రాజ‌కీయ వ‌ర్గాల్లో వెలువ‌డుతోంది. 


స్వ‌త‌హాగా అఖిల ప్రియ చాలా ప‌ట్టుద‌ల మ‌నిష‌ని, అనుకున్న‌ది అనుకున్నట్లుగా కావాల‌ని భీష్మించుకుంటార‌నే విష‌యం నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సోద‌రుడు బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇప్పించుకున్న‌ప్పుడే అంద‌రికీ అర్థ‌మైంది. ఈ నేప‌థ్యంలో.. పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నాకే ఆమె కార్డ‌న్ సెర్చ్ ఊదంతాన్ని ఆస‌రాగా  చేసుకుని బ్లేమ్ చేసేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ని కొంత‌మంది చెబుతున్నారు. ఆమెను బుజ్జ‌గించేందుకు గాని...చ‌ర్చ‌లు జ‌రిపేందుకు గాని నేత‌లెవ‌రూ ముందుకురాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఓ సీనియ‌ర్ మంత్రిని జిల్లా నేత‌లు సంప్ర‌దించి.. ఆమెతో మాట్లాడాల‌ని కోర‌గా.. `ఆమె వినే ర‌కం కాదు.. న‌న్ను వ‌దిలేయండి` అంటూ జారుకున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబే స్వ‌యంగా మాట్లాడితే త‌ప్ప‌.. ఆమె దిగిరావ‌డం క‌ష్టమేనంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: