రాజ‌కీయాల్లో ఉన్న వారు ముఖ్యంగా ఒంట‌రి పోరుతో నెట్టుకురావాల‌ని భావిస్తున్న పార్టీలు ఎంత నిర్మాణాత్మ‌కంగానో మాట్లాడాలి. ఈ విష‌యం కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే,జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చేస్తున్న, చేసిన వ్యాఖ్య‌ల ఆంత‌ర్యం ఏంట‌నే విష‌యంపై మాత్రం ఇప్ప‌టికీ అంతు చిక్కడం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అసలుప‌వన్ ఎప్పుడు ఎవ‌రిని తిడ‌తారో.. ఎవ‌రిని పొగుడుతారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నే వారి సంఖ్య పార్టీలోనే పెరుగుతోంది. తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ స్పందిస్తూ.. తాను సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. 


పార్టీకి ఇప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో బ‌లంలేద‌ని వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌పైనా ఆయ‌న స్పందిస్తూ.. ప్ర‌జ‌లే నాబ‌లం అంటూ సెంటిమెంట్ డైలాగులు కుమ్మ‌రిస్తు న్నారు. మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌ల కోడ్ వ‌స్తున్న నేప‌థ్యంలోరెండు ప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు అభ్య‌ర్థుల వేట‌, క‌న్ప‌ర్మ్ వంటి కీల‌క చ‌ర్య‌ల్లో గ‌త కొన్నాళ్ల‌గా కుస్తీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పార్టీల నేత‌లు అసంతృప్తులు, గోడ‌దూకుళ్లు క‌నిపిస్తున్నాయి. అయితే, సంచ‌ల‌నాల సృష్టిస్తాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల త‌ల‌రాత‌లు మారుస్తాన‌ని చెబుతున్న ప‌వ‌న్ మాత్రం ఇప్ప‌టి వ‌రకు ఇంత దూకుడు చూపించ‌లేక పోయారు. ఇదిలావుంటే, తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత విస్తు గొలుపుతున్నాయి. విశాఖ జిల్లా పాడేరు వెళ్లిన ప‌వ‌న్ అక్క‌డి గిరిజ‌నుల‌తో మాట్లాడారు బాక్సైట్ త‌వ్వ‌కాల‌కు తాము వ్యతిరేక‌మ‌న్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ తవ్వ‌కాల లైసెన్సులు బుట్ట‌దాఖ‌లు చేస్తామ‌ని కూడా చెప్పారు. 


ఈ క్ర‌మంలోనే మ‌రో ఆస‌క్తికక‌మైన వ్యాఖ్య చేశారు. త‌మ‌ది ఒంట‌రి పార్టీ అని, తాను మాత్ర‌మే స్థాపించాన‌ని చెప్పారు. టీడీపీని చంద్ర‌బాబు, వైసీపీని జ‌గ‌న్ స్థాపించ‌లేదని అన్నారు. తాను మాత్రం ఒంట‌రి సైన్య‌మ‌ని ఉద్ఘాటించాడు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, రాత్రికి రాత్రి తాము ఎలా పుంజుకుంటామ‌ని భావిస్తున్నారో అర్ధం కావ‌డం లేద‌ని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. ఇంకా అభ్య‌ర్థుల‌పై క‌స‌ర‌త్తు లేక‌పోవ‌డంపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ చెప్పిన స‌మాధానం జ‌న‌సేన‌లోనే తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. రాత్రికి రాత్రి పుంజుకోలేమ‌ని, త‌మ ల‌క్ష్యం 25 సంవ‌త్స‌రాల‌ని వ్యాఖ్యానించ‌డంతో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌నే ప‌వ‌న్ వ్యాఖ్య‌లు డొల్లేనా ? అని చ‌ర్చించుకోవ‌డం మొద‌లు పెట్టారు. 


అయితే, ఈ వ్యాఖ్య‌ల వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏంట‌నే విష‌యంపైనా మేధావులు దృష్టి పెట్టారు. నిజానికి ఇప్ప‌టికీ ఈ ఐదేళ్ల‌లో(జ‌న‌సేన పార్టీ స్థాపించి) ప‌వ‌న్ అడుగు పెట్ట‌ని జిల్లాలు ఐదుకు పైగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ పుంజుకోవ‌డం కుద‌ర‌దు. అందుకే ఆయ‌న కీల‌క‌మైన జిల్లాల‌పై దృష్టి పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ 40 సీట్లో గెలుచుకుంటే..అధికారంలోకి రావాల‌నుకునే పార్టీకి తురుపుముక్క‌గా మార‌డం ఖాయం. దీంతో ఇటు టీడీపీ కానీ, అటు వైసీపీ కానీ, త‌న‌ను ఏమీ అన‌కుండా ముందుగానే వారి నోళ్లు మూయించేందుకు ప‌వ‌న్ ఇలా వ్యాఖ్యానించాడా? అనే సందేహాలు కూడా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రాత్రికి రాత్రి ఎద‌గ‌లేమ‌ని కేవ‌లం కొన్ని సీట్లు గెలుచుకుని అధికారంలోకి వ‌చ్చే పార్టీని శాసిస్తామ‌నే ధోర‌ణి ప‌వ‌న్‌లో క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. దీనిని బ‌ట్టి అటు టీడీపికి, ఇటు వైసీపీకి కూడా ప‌వ‌న్ కీల‌కం కానున్నాడ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇది నిజ‌మేనా? ప‌వ‌న్ ఊహ‌లు నిజ‌మ‌వుతాయా?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: