అది టీడీపీ కంచుకోట‌! పైగా కీల‌కమంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం! అంతేగాక అక్క‌డ ప‌దేళ్లుగా వారి కుటుంబానిదే హ‌వా! దీంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ప్రాంతంపై అంత‌కంత‌కూ త‌మ ప‌ట్టు పెంచుకుంటూ వ‌స్తున్నారాయ‌న‌. అయితే ఈసారి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో బిగ్ ఫైట్ త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. కంచుకోట బ‌ద్ద‌లు కొట్టాల‌ని ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష వైసీపీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. అందుకు త‌గిన‌ట్టే వ్యూహాలు ర‌చిస్తోంది. మ‌రోవైపు చాప కింద నీరులా జ‌న‌సేన కూడా బ‌లం పుంజుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. అలాగే `మేము కూడా బ‌రిలోనే ఉన్నాం` అంటూ కాంగ్రెస్ కూడా స్వ‌రం వినిపిస్తోంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అంద‌రి దృష్టి ప‌డింది. పాలెగాళ్ల పురుటిగ‌డ్డ అయిన ప‌త్తికొండ‌లో రాజ‌కీయ వ్యూహాలకు ప్ర‌ధాన పార్టీలు ప‌దును పెడుతున్నాయి. దీంతో సైకిల్ మ‌ళ్లీ రివ్వున దూసుకుపోతుందా?  లేక ఫ్యాన్ గాలి వీస్తుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. 


1955లో ఏర్పాటైన పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటి వ‌ర‌కూ  కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు ఆరుసార్లు, టీడీపీ ఏడు పర్యాయాలు, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరోసారి విజయం సాధించాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో పత్తికొండ అసెంబ్లీలోకి వెల్దుర్తి, కృష్ణగిరి, డోన్‌ నియోజకవర్గంలోని మూడు గ్రామాలను తుగ్గలిలోకి కలిపారు. పత్తికొండ, మద్దికెర మండలాలు యథాతథంగా ఉన్నాయి. డోన్‌ అసెంబ్లీ స్థానంలోని కృష్ణగిరి మండలాన్ని పత్తికొండలోకి చేర్చడంతో .. కేఈ  కుటుంబం 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి.. రెండు సార్లూ విజయం సాధించింది. ఐదుసార్లు గెలిచిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని కాదని డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌కు 2009లో టికెట్ ఇచ్చింది టీడీపీ. దీంతో ఎస్వీ సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి విజయం సాధించి.. డిప్యూటీ సీఎం అయ్యారు.


కేఈ కుటుంబానికి కంచుకోటైన పత్తికొండ నుంచి వచ్చే ఎన్నికల్లో త‌న త‌న‌యుడు శ్యాంబాబును బరిలోకి దించాలని కృష్ణమూర్తి నిర్ణ‌యించారు. ఇప్పటికే కార్యకర్తలతో చర్చలు జరిపి శ్యాంబాబు గెలుపున‌కు కృషి చేయాలని కోరారు. వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో అత‌డు ఆరోపణలు ఎదుర్కొంటుండ‌టం కొద్దిగా మైన‌స్‌గా మా రింది. మరోవైపు తుగ్గలిలో రాష్ట్ర శాలివాహన ఛైర్మన్ తుగ్గలి నాగేంద్రతో కేఈ కుటుంబానికి విభేదాలు తార‌స్థాయికి చే రాయి. దీంతో రాజ‌కీయంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శ్యాంబాబు.

ఇక వైసీపీ నుంచి నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి చెరుకుల పాడు శ్రీ‌దేవి బ‌రిలోకి దిగ‌డం దాదాపు ఖాయ‌మైంది. ఈసారి ఎలాగైనా సైకిల్ జోరుకు బ్రేకులు వేయా ల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో ఊరూరా ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు.  పాలెగాళ్ల పురిటిగడ్డ పత్తికొండ అసెంబ్లీని కైవసం చేసుకునేందుకు.. అధికార, విపక్షాలు ప్రయత్నిస్తుండ‌గానే.. మరోవైపు సత్తా చాటేందుకు కాంగ్రెస్, సీపీఎం, జనసేన కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు ప్రారంభించాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: