ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది.  ఇప్పటికే ముఖ్య పార్టీ అధినేతలు ప్రచారంలో మునిగిపోయారు.  ఎవరు ఏ పార్టీ నుంచి జంప్ అవుతున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.  మరోవైపు ఓటర్లను అప్పుడే ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో నిన్న ఉద్రిక్తత తలెత్తింది. జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్న కుమిలిలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ఓటర్ జాబితాతో సర్వే నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. వారి దగ్గర నుంచి ట్యాబ్‌లు లాక్కోగా.. సర్వే ఏజెన్సీ వారు పోలీసులను ఆశ్రయించారు.


వైసీపీ నేతలు కూడా ఆందోళనకు సిద్ధం కావడంతో జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో పాటూ మరికొందరు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని జామి పీఎస్‌కు తరలించారు.  కాగా,  వైసీపీ నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.


టీడీపీ నేతలు సర్వేల పేరుతో ఓట్లను తొలగిస్తుంటే.. ఆ అన్యాయాన్ని అడ్డుకున్న వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సర్వే పేరుతో ప్రభుత్వం వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఈ కుట్రలు పన్నుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం ఏం జరగబోతోందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: