ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సినిమా రంగానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి రావడంతో సహజంగానే ఈ మూడున్నర దశాబ్దాల్లో సినిమా వాళ్లు ఎక్కువ మంది టీడీపీ వైపే ఉంటూ వస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడిప్పుడే సినిమా వాళ్లలో చాలా మంది తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రకటనలు చేస్తుంటే మరికొందరు మాత్రం ఏపీలో వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఎవరి ఈక్వేషన్లు వారికి ఉంటాయి. అయితే ఇప్పటికీ టాలీవుడ్‌లో చాలా మంది సీనియర్లు, కీలకంగా ఉన్నవారు టీడీపీ వైపే ఉంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎంతో మంది సినీ ప్రముఖులకు సైతం రాజకీయ జీవితం ఇచ్చింది. ఆ పార్టీ తరపున ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి మంత్రులు అవడంతో పాటు రాజ్యసభకు ఎంపిక అయిన వారు కూడా ఉన్నారు. 

Image result for trs

ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగేందుకు పలువురు సినీ నటులు, ప్రవాసాంధ్రులు అసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి సినిమా రంగానికే చెందిన సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ ఎంపీగా ఉన్నారు. అలాగే సినిమా రంగంతో సంబంధం ఉన్న శివప్రసాద్‌ సైతం చిత్తూరు ఎంపీగా ఉన్నారు. ఇక సినిమా నిర్మాతగా ఉన్న వల్లభనేని వంశీ గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రముఖ హాస్య నటుడు ఆలీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇటీవల చంద్రబాబును కూడా కలిసారు. వీలైతే ఎమ్మెల్సీగా లేనిపక్షంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పార్టీ తరపున టికెట్‌ ఇచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఈ సారి గుంటూరు తూర్పు సీటును టీడీపీ మైనార్టీలకు కేటాయించాలని చూస్తోంది. 

Image result for ali comedian

ఈ నేపథ్యంలో ఆలీకి లక్కు చిక్కుతుందా లేదా చూడాల్సి ఉంది. అలాగే తాజాగా  వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెనాలి అసెంబ్లీ లేదా ఎమ్మెల్సీ కోరుతున్నారు. అలాగే సీనియర్‌ నటి అయిన వాణీవిశ్వనాధ్‌ చిత్తూరు జిల్లా నగరి సీటును ఆశిస్తున్నారు. అలాగే మరో ప్రముఖ నటి సనా కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే పోటీ చేస్తానని చెబుతున్నారు. దివంగత అగ్రనిర్మాత డీ. రామానాయుడు మేనల్లుడు అయిన నిర్మాత అశోక్‌ కుమార్‌ కూడా టీడీపీ తరపున పోటీ చేసేందుకు గత ఎన్నికల్లోనే ప్రయత్నాలు చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పర్చూరు సీటు ఆశించగా దక్కలేదు. ఈ ఎన్నికల్లో అయినా ఏమైనా ఛాన్స్‌ దక్కుతుందా అన్న ఆశతో ఉన్నారు. ఇక వైసీపీ అధినేత ఇప్పటికే ముగ్గురు నలుగురు ప్రభాసాంధ్రులకు సైతం టికెట్లు ఇచ్చారు. 


ఇక టీడీపీ నుంచి తానా అధ్యక్షుడిగా ఉన్న వేమన సతీష్‌ కడప జిల్లా రాజంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లిఖార్జున రెడ్డి వైసీపీలోకి జంప్‌ చెయ్యడంతో ఆ సీటుపై ఆయన కన్నేశారు. ఇక టీడీపీ ఇప్పటికే కేటాయించిన తొలి టిక్కెట్‌ను మైనార్టీ వర్గానికి చెందిన ఎన్నారై మహిళా షభానా ఖాతూర్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈమే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమార్తె. వచ్చే ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా తాను పోటీ చెయ్యనని చెబుతున్న జలీల్‌ ఆయన నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకునే షభానాకు సీటు కేటాయించారు. ఇప్పటికే ఆమెను బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరి వీళ్లల్లో ఎంత మంది టిక్కెట్‌ రేసులో సఫలీకృతులు అవుతారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: