ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పెద్ద చిక్కుముడిగానే ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు, విపక్ష వైసీపీ నుంచి పార్టీలో చేరిన వారి మధ్య‌ సరైన సమన్వయం లేకపోవడంతో వీళ్లలో ఎవరికి సీటు ఇచ్చినా రెండో వర్గం వ్యతిరేఖంగా పని చేసే ఛాన్స్‌ కనిపిస్తోంది. దీంతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్న చోట లెక్కకు మిక్కిలిగా ఆశావాహులు ఉండడంతో ఎవరికి సీటు ఇవ్వాలో ? కూడా తెలియని పరిస్థితి. విశాఖ జిల్లాలో విపక్ష వైసీపీ నుంచి ప్రాధినిత్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు. ఈయ‌న ఎమ్మెల్యేగా ఉన్న చోడ‌వ‌రం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే ఏడెనిమిది మంది పేర్లు రేసులో ఉండగా తాజాగా మరో ఇద్దరు ముగ్గురు తెర మీదకు రావడంతో ఈ ఒక్క సీటు కోసమే టీడీపీ నుంచి ఏకంగా పది మంది వరకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అయ్యింది. 


మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గవిరెడ్డి రామానాయుడు మరో సారి వచ్చే ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. 2009లో ఘన విజయం సాధించిన రామానాయుడు గత ఎన్నికల్లో బూడి ముత్యాలనాయుడు చేతిలో కేవలం 500 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పాదయాత్రలు, సైకిల్‌ యాత్రల ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లోనూ సీటు తనదే అన్న ధీమాలో ఆయన ఉన్నారు. రామానాయుడు ప్రయత్నాలు ఇలా ఉండగానే ఎన్నారై ప్రసాద్‌రావు కూడా టిక్కెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. గత ఎన్నికల్లో సీటు ఆశించినా అప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడుకే  పార్టీ అధిష్టానం సీటు ఇవ్వడంతో ఆయన ప్రయత్నాలు నెరవేరలేదు. 


ఇక గత మూడేళ్లుగా ప్రసాద్‌రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్ర జన్మభూమి కమిటీ సభ్యుడిగా ఉన్న ప్రసాద్‌రావుకు పార్టీ యువనేత లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యంతో టిక్కెట్‌ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. వీరిద్దరితో పాటు నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సెల‌ర్‌ ముర్రు ముత్యాలనాయుడు తన ప్రయత్నాలుతాను చేస్తున్నారు. ఉన్నత విద్యావంతుడు కావడం, చంద్రబాబుతో ఉన్న పరిచయం నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ముర్రు ముత్యాలనాయుడు సోదరుడు అయిన డాక్టర్‌ ముర్రు జ‌య‌చందర్‌నాయుడు కూడా పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తు తాను కూడా ఓ రాయి వేసి చూద్దాం అనుకుంటున్నారు. అలాగే నియోజకవర్గంలోని చీడికాడ జట్పీటీసీ సభ్యురాలు పోలుపర్తి సత్యవతి భర్త పీవీజీ. కుమార్‌ కూడా టిక్కెట్‌ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి కొణతల రామకృష్ణ‌ ప్రధాన అనుచరుడైన కుమార్‌ తన గురువు కొణతల ద్వారా తనకు టిక్కెట్‌ వస్తుందని ఆశిస్తున్నారు. 


ఇక జిల్లాలో రాజకీయ కురువృద్ధుడు, గతంలో ఐదు సార్లు గెలిచిన  మాజీ ఎమ్మెల్యే రెడ్డి సత్యనారాయణ సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గోవాడ‌ షుగర్ ఫ్యాక్ట‌రీ మాజీ చైర్మ‌న్‌ గూడూరు మల్లునాయుడు గత ఎన్నికల్లో ప్రయత్నాలు చేసి విఫలం అయినా వచ్చే ఎన్నికల్లోనూ పట్టు వదలని విక్రమార్కుడిలా టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దేవరపల్లి మండలానికి చెందిన జట్పీటీసీ గాలి వరలక్ష్మి సైతం టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అలాగే వీరితో పాటు మరో ఇద్దరు ముగ్గురు కూడా మాడుగుల టిక్కెట్‌ రేసులో ఉన్నారు. అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. అక్కడ నుంచి సమీకరణలు కుదరని పక్షంలో ఆయనకు మాడుగుల సీటు ఇవ్వవచ్చని తెలుస్తోంది. 
అలాగే మంత్రి అయ్యన్న తనయుడు చింతకాయల విజయ్‌ సైతం వచ్చే ఎన్నికల్లో పోటీకి ఊవ్విళ్ళూరుతున్నారు. నర్సీపట్నం సీటు అయ్యన్నకే ఇస్తానని చంద్రబాబు స్పష్టం చెయ్యడంతో విజయ్‌ కన్ను పక్కనే ఉన్న మాడుగుల మీద పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ్‌ ఈ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గోవడంతో పాటు కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో మాడుగుల నుంచి విజయ్‌ పోటీ చెయ్యవచ్చని ఓ టాక్‌ వస్తోంది. సబ్బం హరి టీడీపీలో చేరిన తర్వాతే మాడుగుల టీడీపీ అభ్యర్థిపై ఓ స్పష్టత వస్తుందని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మాడుగుల టీడీపీ సీటు కోసం ఏకంగా పది మంది వరకు రేసులో ఉండడంతో ఇక్కడ టీడీపీ రాజకీయం కాక రేపుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: