కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఆరు సార్లు లోక్‌సభకు గెలవడంతో పాటు ఒక సారి రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన ఘనత ఆయన సొంతం. నియోజకవర్గాల పున‌ర్విభజనకు ముందు విజయనగరం జిల్లాలో ఉన్న పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచిన ఆయన 2009లో కొత్తగా ఏర్పడిన అరకు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. గత ఎన్నికల్లో కేంద్ర మంత్రిగా ఉంటూనే అరకు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్‌ కోల్పోయారు. 1977లో కాంగ్రెస్‌ తరపున లోక్‌సభకు ఎన్నిక అయిన ఆయన కాంగ్రెస్‌ చీలిక సమయంలో కాంగ్రెస్‌ యూలోనూ ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎస్‌ పక్షాన రెండు సార్లు గెలుపొందారు. 


1984లో టీడీపీ మద్దతుతో గెలిచారు. గతంలో చరణ్‌ సింగ్‌ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పని చేసిన ఆయ‌న తిరిగి మన్మోహన్‌ సింగ్‌ మంత్రి వర్గంలోనూ పని చేశారు. సీనియర్‌ రాజకీయ నేతగా ఉన్న ఆయన ప్రస్తుతం రాజకీయంగా కొంత కాలంగా స్థబ్దుగా ఉంటూ వస్తున్నారు.కిషోర్‌ చంద్రవ్‌ గతంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరవచ్చని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆదివారం తన అనుచరులతో సమావేశం అవుతున్న కిషోర్‌ చంద్రదేవ్‌ కురుపాంలో టీడీపీలో చేరే అంశంపై ఓ ప్రకటన చెయ్యవచ్చని కూడా సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ, టీడీపీ ఆయనకు రాజకీయంగా ఆప్షన్‌గా ఉన్నా వైసీపీ కంటే తన సీనియార్టీ, తనకు లభించే గౌరవం దృష్ట్యా టీడీపీలోకి వెళ్లడమే మంచిదని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. 


ప్రస్తుతం టీడీపీకి అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఒకరిద్దరు పేర్లు వినపడుతున్నా కిషోర్‌ చంద్రదేవ్‌ లాంటి సీనియర్‌ నేత, బలమైన అభ్యర్థి ఎవరు లేరు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో అరకు నుంచి ఆ పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చెయ్యవచ్చని కూడా తెలిసింది. కిషోర్‌ చంద్రదేవ్‌ లాంటి నేత టీడీపీలోకి వస్తానంటే ఆ పార్టీ అధిష్టానం సైతం కాదనే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ ఎంట్రీకి పెద్దగా అడ్డంకులేవి ఉండకపోవచ్చు. ఏదేమైనా కేంద్ర మాజీ మంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీలో సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా కిషోర్‌ చంద్రదేవ్‌ టీడీపీలో చేరితే ఉత్తరాంధ్ర ఏజన్సీలో ఆ పార్టీకి ప్లస్‌ అవుతుందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: