ఎన్నిక‌లు ముంచుకువ‌చ్చేశాయి. మ‌రికొన్ని వారాల్లోనే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల‌కు రెడీ అవుతోంది. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోనూ ఎన్నిక‌ల కాక మొద‌లైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని క‌లలు కంటున్న ప్ర‌ధాన పార్టీల ప‌రిస్థితి ఇప్పుడు అగమ్య గోచ‌రంగా ఉంది. ఏ యే స్థానాల్లో ఎవ‌రిని ఎంపిక చేయాలి?  ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే విష‌యంలో ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మ‌ధ్య తీవ్ర‌మైన త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది. ప్ర‌తి ఓటూ, ప్ర‌తి సీటూ కీల‌క‌మే అయిన నేప‌థ్యంలో ఎవ‌రికి ఎక్కడ టిక‌ట్ ఇస్తే.. గెలుస్తాము, ఓడుతాము అనే విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తుంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. 


ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ నేత‌ల వార‌సులు క్యూక‌ట్టుకుని మ‌రీ లైన్‌లోకి వ‌చ్చేశారు. ప్ర‌తి సీటులోనూ ఒక‌రిక‌న్నా ఎక్కువ‌గా యువ నాయ‌కులు రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. దీనికితోడు సీనియ‌ర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. త‌మ‌కే టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో ఒక టికెట్‌కు యువ‌త‌, సీనియ‌ర్లు కూడా పోటీ ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో అధికార పార్టీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న మొద‌లైంది. ప్ర‌ధానంగా క‌ర్నూలు, గుంటూరు, అనంత‌పురం వంటి జిల్లాల్లో సీనియ‌ర్లు, వారి వార‌సులు కూడా రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఈ ప‌రిణామంతో ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నేది చంద్ర‌బాబు సంశ‌యంగా మారింది. 


ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్తితి క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్యంగా గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే ఛాన్స్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, తాము కూడా గెలుపు గుర్రాల‌మేన‌ని సీనియ‌ర్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో ఒకే కుటుంబంలో ఇద్ద‌రు నుంచి ముగ్గురు కూడా రంగంలోకి దిగుతుండ‌డంతో ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే స‌మ‌స్య ఎదుర‌వుతోంది.

దీంతో వైసీపీలోనూ టికెట్ల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటే ఏమ‌వుతుందోన‌నే సందేహం నెలకొంది. నిజానికి చంద్ర‌బాబు త‌న పార్టీ అభ్య‌ర్థుల జాబితాను సంక్రాంతి నాటికే ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. అయితే, దీనిని ఫిబ్ర‌వ‌రి నాటికి పొడిగించారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా ఆయన ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల‌య్యేనాటికి.. ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం అంతా కూడా ఎవ‌రికి సీటు స‌ర్దు బాటు చేయాల‌నే విష‌యంపైనే జాప్యం జ‌రుగుతోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇదే ప‌రిస్థితి వైసీపీలోనూ క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: