ఎన్నిక‌ల ఆట ఆరంభానికి ముందే ఆట‌గాళ్లు మారిపోతున్నారు. బ‌ల‌మైన వారు...బ‌లం అవుతారునుకున్న‌వారిని ఆయా పార్టీల జ‌ట్లు లాగేసుకునేందుకు... పొగేసుకునేందుకు తెగ ఆరాటాప‌డిపోతున్నాయి. ఇన్నాళ్లు న‌మ్మ‌కంగా ప‌నిచేసినోళ్లే...పొగిడినోళ్లే...భ‌జ‌న చేసిన నోళ్లే..ఇప్పుడు తిట్ల దండ‌కం మొద‌లు పెడుతున్నాయి... అప‌కీర్తిని ..ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తిసేలా శాప‌నార్థాలు పెడుతున్నాయి. మ‌రి కొద్దిరోజుల్లో ఎన్నిక‌ల స‌మ‌రాంగం మొద‌ల‌వుతుంద‌నుకుంటున్న నేప‌థ్యంలో ఏపీ రాజ‌కీయాల్లో జంపింగ్ జ‌పాంగ్‌లు ఎక్కువ‌య్యాయి. ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ..వైసీపీ ల‌నుంచి అటోళ్లు..ఇటు..ఇటు వాళ్లు అటు చూస్తూ రాజకీయ వాతావ‌ర‌ణాన్ని ప‌సిగ‌డుతూ ' రాజీ ' కీయంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 


అయితే ఈ వ‌ల‌సలు ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్యంగా టీడీపీ నుంచే ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌టం ఆ పార్టీని ఆందోళ‌న‌కు గురి చేస్తున్న అంశం. ప‌ట్టుమ‌ని రెండున్న‌ర నెల‌లు కూడా ఎన్నిక‌ల‌కు లేని స‌మ‌యంలో ఈ ప‌రిణామాలు ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందంట‌. మొన్న‌టి మొన్న ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీకి రాజీనామా చేసేశారు. ఇక వైసీపీలో లాఛ‌నంగా చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీకి రాజీనామా చేసిన వెంట‌నే ఆయ‌న ఏకంగా చంద్ర‌బాబుకు మ‌తిమ‌రుపు ఉందంటూ నోరుతో ప్ర‌తాపం చూపారు.  ఇక అంత‌కు ముందు రావెల కిషోర్ బాబు జ‌న‌సేన బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పటి వరకూ ముగ్గురు సిట్టింగులు టీడీపీని వీడారు. రావెల కిషోర్ బాబు జనసేనలోకి చేరిపోయారు. 


మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచిలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టే. అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కోరుకున్న భీమిలి సీటు ఆయ‌న‌కు ద‌క్క‌ద‌ని తేల‌డంతో వైసీపీ నుంచి భీమిలి సీటుతో పాటు మంత్రి ప‌ద‌వి సైతం ఆయ‌న‌కు వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు టాక్‌. ఇక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోవచ్చు అనే ఊహాగానంలో ఉన్న మరో పేరు తోట త్రిమూర్తులు. ఈయ‌న కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో కామెంట్లు వ‌స్తున్నాయి. అయితే గంటా అంత రిస్క్ చేస్తారా ? అన్న‌ది కూడా సందేహ‌మే. మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పక్కచూపులు చూస్తున్నారని.. కొన్ని అనూహ్యమైన పేర్లు కూడా ఈ జాబితాలో ఉండోచ్చ‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: