ప్రకాశం జిల్లా" జగన్ పార్టీకి ఇక్కడ బలం ఉండటానికి ప్రధాన కారణం... ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉండటమే... 2014 లో ఆరు స్థానాలను ఆ పార్టీ ఇక్కడ గెలుచుకుని సత్తా చాటింది. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో అధికార పార్టీలోకి కీలక ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం, జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టడంతో ఆ అభిమానులు కూడా అధికార పార్టీకి మద్దతు పలుకుతూ మళ్ళీ నువ్వే రావాలి అనే జపం చేస్తున్నారు. దీనికి తోడు జగన్ పార్టీకి ఉన్న గ్రూపు తగాదాలు ఆ పార్టీని సగం ముంచి రెక్కలు వంచేస్తున్నాయి. 


జిల్లాలో పార్టీ ప్రధానంగా రెండు వర్గాలుగా ఉంది... జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం ఒకటి కాగా ఒంగోలు ఎంపీ గా ఉన్న జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి వర్గం ఒకటి. ఇద్దరు బలమైన నేతలే అయినా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉందనేది అందరికి తెలిసిన విషయమే. 2014 లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొన్నది చాలా తక్కువ... దానికి తోడు కీలక నేతలతో ఆయనకు మంచి సంబంధాలు లేవు అనే ప్రచారం ఉన్నా జిల్లా నాయకులతో మాత్రం స్నేహ సంబంధాలున్నాయి. 


దీనితో సుబ్బారెడ్డి అక్కడ ఒంటరయ్యారనే అభిప్రాయ౦ ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ఇంచార్జులతో సుబ్బారెడ్డికి చెడిపోవడానికి బాలినేని కారణం అని అంటూ ఉంటారు. సుబ్బారెడ్డిని జిల్లా నుంచి పంపడానికి ఆయన అసంతృప్తి గళాన్ని సిద్దం చేసి జగన్ కి అనుకూలంగా సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయించిన సందర్భాలు ఉన్నాయి. కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న వరికూటి అశోక్ బాబు... జిల్లాలో సుబ్బారెడ్డి పార్టీని చంపేసి జగన్ కి అన్యాయం చేస్తున్నారని గత ఏడాది వైకాపా కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. 


దీని వెనుక బాలినేని ఉన్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇక ఈసారి జగన్ బాలినేనికి సీటు ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఒంగోలు పార్లమెంట్ సీటుని బాలినేనికి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపధ్యంలో విజయసాయి రెడ్డి ద్వారా మాగుంటను పార్టీలోకి తీసుకుని... బాలినేనికి చెక్ పెట్టాలని సుబ్బారెడ్డి భావిస్తున్నారు. అవసరమైతే తన సీటుని కూడా వదులుకోవడానికి సుబ్బారెడ్డి సిద్దపడ్డారని అంటున్నారు. మాగుంట కోసం సుబ్బారెడ్డి ప్రయత్నాలు చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం బాలినేనిని పక్కకి తప్పించి ఆ సీటుని ఆయనకు ఇవ్వడమే కాదు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇచ్చే విధంగా హామీలు ఇస్తున్నట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: