ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. పార్టీలు ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి రావాల‌ని ఎలా భావిస్తున్నాయో.. నా యకులు కూడా అదే త‌ర‌హాలో విజ‌యం సాధించి గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ మ‌నసు ల్లోని మాట‌ల‌ను కూడా నిజం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. ఇలాంటి వారిలో క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు పార్ల‌మెంటు ఎంపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన మాజీ వైసీపీ నాయ‌కురాలు బుట్టా రేణుక కూడా ముందున్నారు.ఈమెకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో అడుగు పెట్టి మంత్రి ప‌ద‌విని చేప‌ట్టాల‌ని భావిస్తున్నారు. ఇదే విష‌యాన్ని వైసీపీలో ఉండ‌గా.. పార్టీ అధినేత జ‌గ‌న్ ముందుకు వ్య‌క్తీక‌రించారు. 


అయితే, అప్ప‌టికి వైసీపీలో ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. ఇది సాధ్యం కాద‌ని చెప్ప‌డంతోనే ఆమె టీడీపీలోకి జంప్ చేసింది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ క్ర‌మంలోనే ఆమె టీడీపీపై ఒత్తిడి పెంచుతున్నారు. త‌న కు ఎమ్మెల్యే టికెట్ కావాల‌ని చంద్ర‌బాబుపై ప‌రోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఇక, ఇక్క‌డ అనూహ్యంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు కొంత మేర‌కు బుట్టా ఆశ‌ల‌ను ఫ‌లింప జేసేవిగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 28న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ ప‌రిణామం.. బుట్టాకు ప్ర‌త్య‌క్షంగాను, ప‌రోక్షంగానుకూడా అనుకూల రిజ‌ల్ట్ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు. 


కోట్ల క‌నుక టీడీపీలోకి చేరితే.. ఆయనకు కర్నూలు లోక్‌సభ టికెట్‌ ఇచ్చి.. ఎంపీ బుట్టా రేణుకను ఆదోని నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప‌రిణామం కోస‌మే ఎంపీ బుట్టా ఎదురు చూస్తున్నారు.  ఇప్ప‌టికే ఆమె ఆదోనిలో ప‌లు మార్లు ప‌ర్య‌టించి వ‌చ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ త‌మ‌కు ఉన్న అనుకూల ప‌వ‌నాల‌ను కూడా అంచ‌నా వేసుకున్నారు.

బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కు రాలు కావ‌డంతో ఆ వ‌ర్గం ఇక్క‌డ ఎక్కువ‌గా ఉండ‌డంతో త‌న‌కు అనుకూలంగా ఇక్క‌డి పరిస్థితి మారుతుంద‌ని బుట్టా భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. వైసీపీ కూడా బ‌లంగానే ఇక్క‌డ పోటీ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: