ఓట‌ర్ జాబితా వివ‌రాల చోరీపై టీడీపీ అతిగా స్పందిస్తోందంటూ విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  డేటా కుంభ‌కోణం పేరుతో జ‌రుగుతున్న రాజ‌కీయ ర‌గ‌డ‌లో ఎవ‌రికి వారు ల‌బ్ధి పొందేందుకు ఇటు వైసీపీ అటు టీడీపీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీలు రాష్ట్రాన్ని నాశ‌నం చేయాల‌ని చూస్తున్నాయ‌ని  చంద్ర‌బాబు ఆరోపిస్తున్నారు. మూడు పార్టీల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ కుట్రలను నిరసిస్తూ మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో చేయాల్సిన అరాచకాలన్నీ చేశారని, ప్రజలు ఛీకొట్టేసరికి పలాయనం చిత్తగించారని పేర్కొంటున్నారు. తెలంగాణ పెత్త‌నం ఇక్క‌డ సాగ‌నివ్వ‌మ‌ని ఆయ‌న ప‌దేప‌దే చెబుతూ వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే అస‌లు విష‌యం త‌క్కువే అయిన‌ప్ప‌టికి రాజ‌కీయ ర‌గ‌డ‌కు ఆజ్యం పోసి ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తున్నాయి. 


ఐఏఎస్‌ అధికారులు దాచుకోవడానికి కూడా వీలు లేని కీలకమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమగ్ర సమాచారం ఐటీ గ్రిడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా టీడీపీ సామాన్య కార్యకర్త మొబైల్‌లో కూడా ప్రత్యక్షమ‌వుతోందంటూ వైసీపీ విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. దీని వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ప్రత్యక్ష ప్రమేయం ఉందని కూడా ఆరోపిస్తోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాతోపాటు మంత్రి హోదాలోనూ ఉన్న సీఎం తనయుడు నారా లోకేష్‌ ఇందులో కీలక పాత్ర పోషించినట్లుగా  ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఉపయోగపడేలా ఐటీ గ్రిడ్‌ సంస్థ ద్వారా లోకేష్‌ ఓ విశ్లేషణ తయారు చేయించార‌న్న‌ది వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ విష‌యంపై ఆయ‌న సూటిగా స్ప‌ష్టంగా వివ‌ర‌ణ ఇచ్చిన దాఖ‌లాలైతే లేవ‌నే చెప్పాలి. 


రాజ‌కీయ  అనుభ‌వం ఉన్న నేత‌గా చంద్ర‌బాబు న‌డుచుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దొంగ‌త‌నం చేయ‌నిదే బాబుకు ఎందుకంత ఉలికిపాటు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సూటిగా స‌మాధానం ఇవ్వ‌డంలో చంద్ర‌బాబు వైఫ‌ల్యం చెందార‌నే చెప్పాలంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మూడున్న‌ర కోట్ల మంది ఆంధ్రప్ర‌దేశ ఓట‌ర్ల జాబితా వివ‌రాలను టీడీపీ చోరీ చేసిదంటూ వైసీపీతో పాటు తెలంగాణ‌లో టీఆర్ ఎస్ నేత కేటీఆర్ విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే.

ఇందులో అటు ఏపీ పోలీసులు..ఇటు తెలంగాణ పోలీసుల జోక్యంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య వైరంగా మారింది.  కొండ‌ను త‌వ్వితే ఎలుక కూడా బ‌య‌ట ప‌డ‌లేదు అన్న‌ట్లుగా త‌యారైంది ఈ విష‌యం. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ మంగ‌ళ‌వారం ఇచ్చిన వివ‌ర‌ణ ప్ర‌కారం..స‌మాచారం హ‌క్కు చ‌ట్టం ప్ర‌కారం ఓట‌ర్ జాబితాను ఎవ‌రైనా పొంద‌వ‌చ్చు. ఇదే జాబితా ప్ర‌స్తుత ఎన్నిక‌ల క‌మిష‌న్ పోర్ట‌ల్ కూడా ల‌భ్య‌మ‌వుతుంది. అయితే ఫొటోల‌తో కూడిన జాబితా మాత్రం బ‌య‌ట‌కి వెల్ల‌కుండా చూడ‌టం త‌మ విధి అని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: