డాటా చోరీ విషయంలో కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ సిట్ కు పోటీగా సిట్ వేసి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అంతే కాదు.. తెలంగాణ ఏపీకి ఏమాత్రం సాటి రాదంటూ ఫైర్ అవుతున్నారు చంద్రబాబు.



తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనకంటే ఏ విషయంలోనైనా బాగా చేశారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఏ విషయంలో తనకన్నా మెరుగ్గా చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌కు కేసీఆర్ సర్కార్‌ పూర్తిగా సహకరిస్తున్నందునే ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నాడని మండిపడ్డారు.



కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని సీఎం దుయ్యబట్టారు. తాము 20 ఏళ్ల నుంచి కార్యకర్తల డేటాను కంప్యూటరైజ్‌ చేస్తే ఆ సమాచారం దొంగిలించి తమ ప్రభుత్వంపైనే కేసు పెడతారా అంటూ మండిపడ్డారు. ఫారం-7 పెట్టి ఓట్లను తొలగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అనుసరిస్తారా అని మండిపడ్డారు.



కార్యకర్తలు డేటా సేకరిస్తే తప్పు ఏంటని ప్రశ్నించారు. ఒక ప్రైవేటు కంపెనీ డేటాను ఏ చట్ట ప్రకారం తీసుకుంటారని నిలదీశారు. ఓట్లను చెక్‌ చేసుకోవాలని ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేశామన్న చంద్రబాబు ఈ అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.  జగన్‌ను బలపరచడానికి ఏపీ వ్యాపారవేత్తలపై కేసీఆర్ దాడులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: