మంత్రి లోకేష్‌బాబు పోటీ చేసే స్థానం చుట్టూతే విశాఖ టీడీపీ నేత‌ల భ‌విష్య‌త్ నిర్ణ‌యం కానుంది. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ విశాఖ జిల్లా ప‌రిధిలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గాని విశాఖ ఉత్త‌ర స్థానం నుంచి గాని పోటీ చేస్తార‌ని పార్టీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈమేర‌కు మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇటు చంద్ర‌బాబు గాని..అటు లోకేష్‌గాని వీటిని ఖండించ‌డం చేయ‌క‌పోవ‌డంతో ఈ వార్త‌ల్లో నిజ‌ముంద‌నే టీడీపీ శ్రేణులు బ‌లంగా న‌మ్ముతున్నాయి. అదే జ‌రిగితే భీమిలి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గంటా శ్రీనివాస‌రావు విశాఖ ఉత్తర నియోజ‌కవ‌ర్గా నికి మారాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో విశాఖ ఉత్త‌ర స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తే భీమిలి నుంచి  య‌థావిధిగా గంటానే బ‌రిలో ఉండ‌నున్నారు. 


అయితే విశాఖ లోక్‌స‌భ‌కు కూడా గంటా శ్రీనివాస‌రావు పేరు ప‌రిశీల‌న‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక వేళ గంటాను ఎంపీగా పంపాల‌నుకుంటే మాత్రం భీమిలికి మ‌రో కొత్త అభ్య‌ర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. లోకేష్ బాబు పోటీ చేసే స్థానంపై ఇంకా సందిగ్ధం తొల‌గ‌క‌పోవ‌డంతో ఆ ప్ర‌భావం మిగ‌తా స్థానాల‌కు అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌పైనా ప‌డుతోంది. అయితే ఆశావ‌హుల్లో మాత్రం రోజురోజుకు టెన్ష‌న్ పెరిగిపోతోంది. అన‌కాప‌ల్లి ఎంపీ టికెట్ అంశం కూడా లోకేష్ పోటీ చేసే స్థానంతో లింక్ చేసి ఉండ‌టం గ‌మ‌నార్హం. అన‌కాప‌ల్లి ఎంపీ అభ్య‌ర్థిగా  మాజీ ఎంపీ కొణ‌తాల పేరు ప్ర‌ముఖంగా విన‌బ‌డుతోంది. ఆయ‌న్ను బ‌రిలోకి దించాలని ఇప్ప‌టికే చంద్ర‌బాబు భావిస్తుండ‌గా విశాఖ డైరీ చైర్మ‌న్ ఆడారి తుల‌సీరావు త‌న‌యుడు ఆనంద్‌రావు పేరు కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది.


వాస్త‌వానికి ఆనంద్‌రావు పేరును అన‌కాపల్లి ఎంపీ స్థానం ప‌రిధిలో ఉన్న ప‌లువురు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే బ‌లంగా తెర‌మీద‌కు తీసుకురావ‌డం విశేషం. ఆనంద్‌రావుకు ఎంపీ టికెట్ కేటాయించ‌ని ప‌క్షంలో య‌ల‌మంచిలి టికెట్ కేటాయించి..త‌న‌కు విశాఖ ఉత్త‌రం టికెట్ కేటాయించాల‌ని ఎమ్మెల్యే ర‌మేష్‌బాబు కొత్త ప్ర‌తిపాద‌నను తీసుకువ‌చ్చారు. దీంతో ఇప్పుడు రెండు లోక్‌స‌భ స్థానాలకు లోకేష్ లింక్ తలిగి ఉంది. ఇక రెండు లోక్‌స‌భ స్థానాల్లో ఒక‌టి కాపు సామాజిక వ‌ర్గం నేత‌ల‌కు కేటాయించే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

లోకేష్ బాబు పోటీ చేసే స్థానంపై క్లారిటీ లేక‌పోవ‌డంతో భీమిలి, విశాఖ ఉత్త‌రం, చొడ‌వ‌రం, మాడుగుల‌, పాయ‌క‌రావుపేట‌, అన‌కాప‌ల్లి స్థానాల‌కు అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లో జాప్యం ఏర్ప‌డుతోంది. ఇక  విశాఖ తూర్పు, విశాఖ ద‌క్షిణం, విశాఖ ప‌శ్చిమ, గాజువాక‌, య‌ల‌మంచిలి, న‌ర్సీప‌ట్నం, పెందుర్తి, శృంగ‌వ‌ర‌పుకోట స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: