విజ‌య‌నగ‌రం జిల్లాలో టీడీపీ టికెట్ల కేటాయింపు అంశం ఇంకా పూర్తిగా కొలిక్కిరావ‌డం లేదు. ఇక్క‌డ వైసీపీ చాలా బ‌లంగా క‌నిపిస్తుండ‌టంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై సొంత పార్టీకి చెందిన నేత‌లే విమ‌ర్శ‌లకు దిగ‌డం..వారి అవినీతి, అక్ర‌మాల జాబితా అంద‌జేయ‌డంతో పాటు పార్టీలో వ‌ర్గ విబేధాల‌ను పెంచిపోషిస్తున్న తీరుపై సాక్ష్యాధారాల‌తో స‌హ అధినేత‌కు విన్న‌విస్తూ వ‌స్తున్నారు. అమ‌రావ‌తిలో జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌రిగిన స‌మీక్ష‌లో కొంత‌మంది ఆయా నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు సిట్టింగ్ సీట్లు కేటాయించ‌వ‌ద్దంటూ ఏకంగా ప్ల‌కార్డులు ప‌ట్టుకుని మ‌రీ వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేయ‌డంతో చంద్ర‌బాబు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. ఈక్ర‌మంలోనే ముఖ్యంగా మూడు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌కుండా పెండింగ్‌లో పెట్టేశారు.


విజ‌యన‌గ‌రం, నెల్లిమ‌ర్ల‌, గ‌జ‌ప‌తిన‌గ‌రం, చీపురుప‌ల్లి, సాలూరు, కురుప్పంలో పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా  చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి భారీ స్థాయిలో వ్యతిరేకత  వస్తుండగా, గజపతినగరం ఎమ్మెల్యే కె.ఏ.నాయుడుకు టిక్కెట్టు ఇవ్వవద్దంటూ సాక్షాత్తూ ఆయన అన్న కొండబాబు గట్టిగా పట్టుపడుతున్నారు. నెల్లిమ‌ర్ల  ఎమ్మెల్యేపైనా అదే స్థాయిలో వ్య‌తిరేక‌త ఉండ‌టంతో చంద్ర‌బాబు త‌ల‌ప‌ట్టుకున్న‌ట్లు స‌మాచారం. స‌ద‌రు సిట్టింగ్‌ల‌కు సీట్లు కేటాయిస్తే ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హ‌క‌రించేది లేద‌ని తెగేసి చెబుతుంటంతో  టీడీపీ వ‌ర్గాల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఆస‌లే పార్టీకి ఎదురుగాలి వీస్తుండ‌టం, ప్ర‌త్య‌ర్థి వైసీపీ బ‌లంగా ఉండ‌టానికి తోడు ఇప్పుడు స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం త‌యారైతే ఇక ఓట‌మికి ఖాయ‌మ‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. 


అయితే కొద్దిరోజులు ఆగితేగాని విజ‌య‌న‌గ‌రం పార్టీ రాజ‌కీయం అర్థంకాద‌ని భావించిన చంద్ర‌బాబు టికెట్ల కేటాయింపు అంశాన్ని తాత్క‌లికంగా వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వ‌డ‌మా...?! కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించ‌డ‌మా ..? అనే విష‌యంపై ఇటు ఇంటెలిజెన్స్ అధికారుల‌తోనే స‌ర్వే చేయిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇప్ప‌టికే స‌ర్వేలో సిట్టింగ్‌ల‌పై వ్య‌తిరేక‌త ఉన్నట్లు త‌నకు నివేదిక అంద‌డంతో చంద్ర‌బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అస‌మ్మ‌తి జ్వాల అధికంగా ఉండ‌టంతో మొండిగా వ్య‌వ‌హ‌రించి సిట్టింగ్‌ల‌కే టికెట్ ఇస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న మీమాంస చంద్ర‌బాబును ఎంటాడుతోంద‌ట‌. చూడాలి ర‌స‌వ‌త్త‌రంగా మారిన విజ‌యన‌గ‌రం టీడీపీ రాజ‌కీయం ఏ మ‌లుపు తిరుగుతుందో మ‌రి..!


మరింత సమాచారం తెలుసుకోండి: