ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దివిసీమ (అవనిగడ్డ నియోజకవర్గం)రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ నుండి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోసారి అవనిగడ్డని దక్కించుకోవాలని టీడీపీ చూస్తుంటే....ఎలా అయిన టీడీపీకి చెక్ పెట్టి ఈ సీటుని తమ సొంతం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఇక ప్రజలు తమకు కూడా అవకాశం ఇస్తారని జనసేన ఎదురుచూస్తోంది. కాగా, 2014లో కాంగ్రెస్ నుండి టీడీపీలోకి వచ్చి సీనియర్ నేత మండలి బుద్ద ప్రసాద్ ఇక్కడ నుండి విజయం సాధించారు. ఇక ఈ సారి కూడా ఆయనే మరోసారి టీడీపీ నుండి బరిలోకి దిగుతున్నారు. అయితే నియోజకవర్గం పరంగా అభివృద్ధి బాగానే జరిగినా...ఐదేళ్ళు గడుస్తున్నా ఆయన టీడీపీ శ్రేణులతో మమేకం కాలేదనే విమర్శలు ఉన్నాయి.


టీడీపీ శ్రేణులకు కూడా పూర్తి స్థాయిలో ఆయన అందుబాటులో లేకపోవటం, వారితో సమన్వయం లోపం కారణంగా పలు మండలాల్లో ఆయనపై కొంత వ్యతిరేకిత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృదు స్వభావిగా ఉండటం, సీనియర్ నేత కావడంతో టీడీపీ నుంచి మరోసారి బుధ్ధప్రసాద్‌నే బరిలోకి దింపుతుంది. అటు గత ఎన్నికల్లో కేవలం 6 వేల ఓట్లతో ఓటమి పాలైన సింహాద్రి రమేశ్... ఈసారి కూడా వైసీపీ తరుపున బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, ప్రభుత్వం మీద వ్యతిరేకిత తనని గెలిపిస్తాయని సింహాద్రి ధీమాగా ఉన్నారు.


ఇక జనసేన కూడా ఇక్కడ నుండి గట్టి అభ్యర్ధినే బరిలోకి దింపనుంది. పవన్ సన్నిహితుడు, జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావు దివిసీమ నుండి బరిలోకి దిగటం ఖాయమే. అయితే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే అవనిగడ్డలో పోటీ చేసే అభ్యర్థులు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. మరి కాపులు ఏ పార్టీకి ఎక్కువ మద్ధతు ఇస్తారో తెలియాల్సి ఉంది. అలాగే అవనిగడ్డలో కాపులతో పాటు... బీసీ కూడా విజయాన్ని నిర్ణయిస్తారు. మరి చూడాలి ఈ త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో...దివిసీమలో ఈ సారి ఏ పార్టీ పాగా వేస్తుందో


మరింత సమాచారం తెలుసుకోండి: