బీకామ్‌లో ఫిజిక్స్ ఉంది అంటూ వ్యాఖ్యానించి ఫేమస్ అయిన విజయవాడ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్  ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని తన కుమార్తె ష‌బానా ఖాతూన్‌కి టికెట్ ఇప్పించుకున్నారు. తన రాజకీయ వారసురాలిగా షబానాని ఈసారి ఎన్నికల్లో పశ్చిమ బరిలో దింపుతున్నారు.అయితే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున జలీల్ ఇక్క‌డ నుండి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ తర్వాత నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసమని చెప్పి ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్‌గా ఆయ‌న ప‌ద‌విలో ఉన్నారు. ముస్లింనేత‌గా గుర్తింపు పొందినా.. జలీల్...కొండ ప్రాంత వాసుల‌కు ప‌ట్టాలు ఇప్పించ‌డంలో ప్రధాన  పాత్ర‌ పోషించారు. అదేవిధంగా వ్యాపార వ‌ర్గానికి పుట్టినిల్ల‌యిన పాత‌బ‌స్తీలోనూ జ‌లీల్ ముద్ర స్ఫ‌ష్టంగా క‌నిపిస్తుంది.


ఇక ఆరోగ్య కారణాలతో పోటీకి దిగలేక...తన కుమార్తెకి టికెట్ దక్కేలా చూసుకున్నారు. కుమార్తె విజయం కోసం తెర వెనుక ఉండి వ్యూహాలు రచిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే షబానా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మిగతా పార్టీలకి చెక్ పెట్టి రాబోయే ఎన్నికల్లో షబానా విజయం సాధించాలని చూస్తున్నారు. అయితే ప్రభుత్వం, జలీల్ మీద వ్యతిరేకిత బాగానే ఉంది.  అలాగే ప్రత్యర్ధి పార్టీ వైసీపీ ఇక్కడ బలంగా ఉంది. అటు రెండు సార్లు పశ్చిమ టికెట్ దక్కని అసంతృప్తితో ఉన్న టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా...జలీల్ కుమార్తెకి ఏ మేర సహకరిస్తారో  అనేది కూడా సస్పెన్స్‌గా ఉంది.

Image result for jaleel khan daughter

ఇక వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు  బరిలోకి దిగుతున్నారు. ఆయన రావాలి జ‌గ‌న్‌.. కావాలి జ‌గ‌న్ అంటూ ఇంటింటి ప్ర‌చారం చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు.  గత ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసే స్వల్ప మెజారిటీతో జలీల్ చేతిలో ఓడిపోయిన వెల్లంపల్లి...ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇక పార్టీలో చేరిన దగ్గర నుండి ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వైసీపీ కార్యకర్తలని ఏకతాటిపైకి తీసుకొచ్చారు.  అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకితని క్యాష్ చేసుకుని మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని వెల్లంపల్లి భావిస్తున్నారు.


అటు పశ్చిమ జ‌న‌సేన సీటు పోతిన మ‌హేశ్‌కి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.  అయితే ఇక్కడ జనసేన ఏ మేర ప్రభావం చూపుతోంది అనేది చెప్పలేం గాని ... ప్రధాన పోరు మాత్రం టీడీపీ,వైసీపీల మధ్యే ఉంటుంది. ఇక ఇక్క‌డ మెజారిటీ ప్ర‌జ‌లు ముస్లింలు ఉన్నారు. వీరే గెలుపోటములని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే వైశ్య, బ్రాహ్మ‌ణ‌, జైన, మార్వాడీ వ‌ర్గాలు కూడా అధిక సంఖ్య‌లోనే ఉన్నాయి. మరి చూడాలి ఈసారి పశ్చిమలో బీకామ్ ఫిజిక్స్ నేత కుమార్తె గెలుస్తుందో లేక  వైసీపీ నేత వెల్లంపల్లి విజయం సాధిస్తారో....


మరింత సమాచారం తెలుసుకోండి: