ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ముంచుకు వ‌చ్చిన నేప‌థ్యంలో, వ‌చ్చే ఎన్నికల్లోనూ విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చేందు కు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నప్ప‌టికీ.. పార్టీలో అస‌మ్మ‌తి సెగ‌లు పొగ‌లు క‌క్కుతోంది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట‌గా ఉన్న గుంటూరు జిల్లాలో కీల‌క‌మైన నాయ‌కుడు, మాజీ మంత్రి, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌కు వ్య‌తిరేకంగా త‌మ్ముళ్లు క‌దంతొక్కుతున్నారు. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల్లో త‌న కుటుంబానికి ఒక ఎంపీ స‌హా రెండు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాల‌ని కోడెల భావించారు. త‌న‌కు, త‌న కుమార్తె, కుమారుడికి కూడా టికెట్టు ఇప్పించుకోవాల‌ని అనుకున్నారు. పోనీ . ఇది వ‌ర్క‌వుట్ కాక‌పోతే.. త‌న కుమారుడికైనా టికెట్ ఇప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. 


అయితే, అనుకున్నామ‌ని జ‌ర‌గ‌వు- అన్న‌ట్టుగా.. ఇవ‌న్నీ ఒక‌ప‌క్క స‌క్సెస్ కాక‌పోగా.. ఏకంగా త‌నకే ఎస‌రు తెచ్చిపెట్టిన ప రిస్థితుల‌తో ఎదురు ఈదుతున్నారు సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గ‌జం కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు. గ‌త ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నియో జ‌క‌వ‌ర్గం నుంచి అతి క‌ష్ట‌మ్మీద గెలుపొందిన కోడెల‌.. ఇప్పుడు అదే నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. కొన్నాళ్ల కింద‌ట పార్టీల‌కు అతీతంగా ఒక్క టీడీపీ మిన‌హాయించి.. ఇక్క‌డ కోడెల‌కు వ్య‌తిరేకంగా తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మం త‌ర‌హాలో ఆందోళ‌న చేశాయి. కోడెల ఫ్యామిలీ చేస్తున్న అక్ర‌మాలు, అన్యాయాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాయ‌కులు ముక్త‌కంఠంతో నిన‌దించారు. అయితే, వీటిని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల ఎత్తుగ‌డ‌లు, విమ‌ర్శ‌లుగా కొట్టి పారేశారు కోడెల‌. 


క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఎన్నిక‌లకు స‌మ‌యం సిద్ధ‌మైన నేప‌థ్యంలో టికెట్ ల పందేరం కొలిక్కి వ‌స్తున్న నేప‌థ్యంలో తిరిగి స‌త్తెన‌ప‌ల్లి టికెట్‌నే చంద్ర‌బాబు కోడెల‌కు కేటాయించారు. దీంతో తాను ఈ ఎన్నిక‌ల్లో దాదాపు 15 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధిస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే... అస‌లు సిస‌లు విష‌యం ఇప్పుడే తెర‌మీదికి వ‌చ్చింది. స‌త్తెన‌ప‌ల్లి టీడీపీలోనే కోడెల‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయం రుస‌రుస‌లాడుతోంది. కోడెలకు టికెట్ ఇవ్వొద్దు! అంటూ సొంత పార్టీ నాయ‌కులే రోడ్లెక్కి నినాదాలు చేస్తున్నారు. ఏకంగా సీఎం చంద్ర‌బాబు నివాసానికి వ‌చ్చిన స‌త్తెన‌ప‌ల్లి టీడీపీ నాయ‌కులు ``కోడెల హ‌ఠావో.. స‌త్తెన‌ప‌ల్లి బ‌చావో``-నినాదాల‌తో హోరెత్తించారు. ఎట్టిప‌రిస్థితిలోనూ కోడెల‌కు స‌త్తెన‌ప‌ల్లి టికెట్ ఇవ్వ‌ద్ద‌ని వారు ముక్త‌కంఠంతో డిమాండ్ చేయ‌డంతో ప‌రిస్థితి ఎలా మారుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: