దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఎస్సీ రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గంగా కేటాయింప‌బ‌డుతూ వ‌స్తున్న ముమ్మిడివ‌రం గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌ర‌ల్ స్థానంగా మారింది. దీంతో  ఈ స్థానం రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆక‌ర్షించ‌డం మొద‌లుపెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ టీడీపీ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గుత్తుల సాయిపై టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు 29,535 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు.ఇక ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ పోటీలో ఉండే అవకాశముంది. అలాగే టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన దాట్ల సుబ్బరాజుకే ఖ‌రారైంది. 


ఇక జనసేన పార్టీ అభ్యర్థిగా శెట్టిబలిజ సామాజికి వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ పోటీలో ఉంటారు. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌ పోటీలో ఉండే అవకాశముంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం  సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పెన్మత్స జగ్గప్పరాజు, గంగిరెడ్డి త్రినాథరావు, ముషిణి రామకృష్ణరావు, వేగేశ్న నరసింహరాజు, పి.ఉదయ భాస్కరవర్మల మ‌ధ్య పోటి నెలకొంది. ఎస్సీ, బీసీ సామాజిక వ‌ర్గాల ఓట‌ర్లు అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల స్థాయిలో ఉండ‌టంతో అభ్య‌ర్థుల‌ను కూడా పార్టీలు బీసీల‌కు కేటాయించడానికే మొగ్గు చూపుతుండ‌టం విశేషం. నియోజకవర్గంలో ఎస్సీ, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ, కాపు సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. బీసీ ఓట్లు 60 శాతం పైబడి ఉండటంతో ఎన్నికల్లో వీరి ప్ర‌భావం బ‌లంగా ఉండ‌నుంది. 


ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో దివంగ‌త లోక్‌స‌భ స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి ప్రాతినిధ్యం వ‌హించారు. ఆయ‌న ఇక్క‌డి నుంచి రెండు మార్లు విజ‌యం సాధించారు. మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్టారు. అటు త‌ర్వాత బాల‌యోగి  మ‌ధ్య‌త‌ర ఎన్నిక‌ల్లో అమ‌లాపురం ఎంపీగా గెలిచి కేంద్రంలో బీజేపీకి టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పొత్తులో భాగంగా బాల‌యోగికి లోక్‌స‌భ స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించింది. ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే గ‌త ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఈ సారి ఇక్క‌డ ఎలాగైనా గెల‌వాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందుకే రెండు సంవ‌త్స‌రాలుగా నియోజ‌క‌వ‌ర్గంపై అధినేత జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించి శ్రేణుల‌ను ప్రొత్స‌హిస్తూ వ‌స్తున్నార‌ట‌. ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీయే  ప్ర‌భుత్వం హోదాలో ఉండ‌టంతో అనేక అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టారు.

నియోజ‌క‌వ‌ర్గంలోని అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాల‌ను అంద‌గ‌లిగేలా చూశారు. దీంతో ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయ‌మే ఉంది.  పార్టీలో కూడా పెద్ద‌గా వ్య‌తిరేక‌త క‌న‌బ‌డ‌టం లేదు. దీంతో ఈ సారి ముమ్మిడివ‌రంలో ఆస‌క్తిక‌ర పోలింగ్ ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.


నియోజ‌క‌వ‌ర్గంలో కులాల వారీగా చూస్తే ఓట‌ర్లు శెట్టిబలిజలు  41,414, మాలలు  49,905, మాదిగలు  13,885, 
కాపులు  29,552, అగ్నికుల క్షత్రియలు  43,774,  క్షత్రియులు  11,223 ఉన్నారు. ముమ్మిడివరం, కాట్రేనికోన,
ఐ.పోలవరం, తాళ్లరేవు మండ‌లాలు ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: