అవి 1989 జరిగిన అసెంబ్లీ ఎన్నికలు...అప్పుడు తిరువూరు నుండి కాంగ్రెస్ తరుపున కోనేరు రంగారావు... టీడీపీ నుండి కొత్తపల్లి రవీంద్రబాబు పోటీ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా కోనేరు చేతిలో కొత్తపల్లి ఓడిపోయారు.కట్ చేస్తే సరిగ్గా 30 సంవత్సరాలు తర్వాత అదే స్థానం నుండి  రవీంద్రబాబు తమ్ముడు, మంత్రి కె.ఎస్ జవహర్ టీడీపీ తరుపున బరిలోకి దిగుతున్నారు. నాడు అన్న ఓడిన చోటే ఇప్పుడు గెలిచి చూపిస్తానంటూ జవహర్ ప్రత్యర్ధులకు సవాల్ విసురుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడుగా విద్యార్ధులని ఉత్తములుగా తీర్చిదిద్దిన జవహర్...ఉపాధ్యాయ సంఘాలకి కూడా ప్రాతినిధ్యం వహించి వారి హక్కుల కోసం పోరాడారు. అలా ఉపాధ్యాయ సంఘాలకు నాయకత్వం వహించిన జవహర్ పనితీరు నచ్చి చంద్రబాబు మరి పిలిచి కొవ్వూరు టికెట్ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయ పదవిని వదులుకుని జవహర్ 2014 ఎన్నికల్లో కొవ్వూరు బరిలో దిగారు. అయితే, జ‌వ‌హ‌ర్ పెద్ద‌గా ఎవ‌రికీ ప‌రిచ‌యం లేక‌పోవ‌డంతో గెలుపుపై సందేహాలు ఏర్ప‌డినా.. విద్యావంతుడు, ఉపాధ్యాయుడు కావ‌డం, చంద్ర‌బాబు విజ‌న్, కొవ్వూరు టీడీపీ కంచుకోట కావడంతో జవహర్‌ని విజయం వరించింది.


ఇక మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిని సమర్ధవంతంగా నిర్వహించిన జవహర్‌ పని తీరుకి ఫిదా అయి చంద్రబాబు.... 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ‌లో ఎస్సీ కోటాలో జ‌వ‌హ‌ర్‌కు అవ‌కాశం ఇచ్చారు. అది కూడా రాష్ట్రానికి ఆదాయం స‌మ‌కూర్చి పెట్టే ఎక్సైజ్ శాఖ‌ను అప్ప‌గించారు. జ‌వ‌హ‌ర్ ఈ శాఖ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించారు. అవినీతి లేకుండా ఈ శాఖ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌వ‌హ‌ర్‌.. ప్ర‌తి నెలా ఎక్సైజ్ పోలీస్ స్టేష‌న్ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం నుంచే నిధులు అందేలా ఏర్పాటు చేశారు. ఇక‌, గ్రామీణ భార‌తాన్ని ప‌ట్టి పీడుస్తున్న గంజాయి వంటి పెంప‌కంపైనా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి రాష్ట్రంలో గంజాయి సాగును అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. బెల్టు షాపుల‌ను అరిక‌ట్టేందుకుకూడా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు. ఫ‌లితంగా రాష్ట్రంలో బెల్టు షాపుల‌కు దాదాపు అడ్డుక‌ట్ట ప‌డింది. అవినీతి ర‌హితంగా సిబ్బంది వ్య‌వ‌హ‌రించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. 


ఇలా త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ను సంపూర్ణంగా నెర‌వేర్చిన మంత్రి జ‌వ‌హ‌ర్‌కి చంద్రబాబు వద్ద మంచి మార్కులే పడ్డాయి. అలాగే ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట కూడా పట్టించారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత రాజకీయ అవసరాల దృష్ట్యా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గత మూడు పర్యాయాలుగా ఓటమి బాటలో ఉన్న తిరువూరుని గట్టెక్కించేందుకు మంత్రి జవహర్‌ అయితేనే సమర్ధుడని భావించి...చంద్రబాబు ఈ సారి ఎన్నికల్లో తిరువూరు బరిలోకి దించాలని నిర్ణయించారు. ఇక ఈ ప్రతిపాదనని ఆయనకి చెప్పి..అక్కడ మూడు సార్లుగా పార్టీ ఓడిపోతుంది..మీరు బరిలో ఉంటేనే మనకు గెలుపు సులువు అవుతుంది. కాబట్టి ఈసారి తిరువూరు నుండి పోటీ చేయాలని చంద్రబాబు జవహర్‌ని ఒప్పించారు. ఇక అధినేత మాట కాదనలేని మంత్రి వెంటనే తిరువూరు వచ్చి...ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.   


అయితే ఇక్కడొక విశేషం ఏమిటంటే 1989 ఎన్నికల్లో జవహర్ అన్న అయిన రవీంద్రబాబు టీడీపీ నుండి పోటీ చేసి కోనేరు రంగారావు చేతిలో ఓడిపోయారు. ఇక 30 ఏళ్ల తర్వాత అన్న ఓడిన చోటే తమ్ముడు జవహర్ బరిలోకి దిగటం ఆసక్తికరంగా మారింది.  ఇక జవహర్ కుటుంబం గురించి తిరువూరు ప్రజలందరికీ తెలుసు. గతంలో ఓడిపోయిన రవీంద్ర గాని...ఇప్పుడు మంత్రిగా ఉన్న జవహర్‌ లాంటి మంచి వ్యక్తులు తిరువూరు నుండి పోటీ చేయడం వారి అదృష్టంగా భావిస్తున్నారు. ఇక జవహర్ రాకతో తిరువూరు టీడీపీ క్యాడర్‌లో మంచి ఊపు వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో జవహర్‌ని గెలిపించడానికి పని చేస్తున్నారు. అటు ప్రజలు కూడా జవహర్ రాకని స్వాగతిస్తూ...ఇలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని చూస్తున్నారు. మరో కొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో జవహర్‌కి ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. మొత్తానికి నాడు అన్న ఓడిన చోటే తను గెలిచి సత్తా చాటాడానికి మంత్రి కూడా సంసిద్ధంగా ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: