జిల్లాలో మిగతా స్థానాల్లో పరిస్తితి ఎలా ఉన్న గుంటూరు పశ్చిమలో పోరు మాత్రం ఈసారి ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ టీడీపీ నుండి మద్దాల గిరి పోటీ చేస్తుండగా...వైసీపీ నుండి చంద్రగిరి యేసురత్నం, జనసేన నుండి సీనియర్ నేత తోట చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ కూడా సరికొత్తగా ఆలోచించి... నచ్చావులే, స్నేహితుడా లాంటి సినిమాలతో మెప్పించిన హీరోయిన్ మాధవీలతని  పశ్చిమ బరిలో దింపింది. అయితే బీజేపీ ఇక్కడ ఏ మేర ప్రభావం చూపుతుందో తెలియదుగాని....మాధవీలత మాత్రం అప్పుడే ప్రచారం షురూ చేసేశారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఇక్కడ నుండి టీడీపీ తరుపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. వైసీపీ అభ్యర్ధి లేళ్ళ అప్పిరెడ్డిపై సుమారు 17వేల పైనే ఓట్ల తేడాతో గెలిచారు. 


ఈ ఎన్నికల సమయానికి మోదుగుల వైసీపీలోకి వెళ్ళి గుంటూరు పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్నారు. దీంతో టీడీపీ గత ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుండి పోటీ చేసి ఓడిపోయిన మద్దాలి గిరిని ఈ సారి పశ్చిమ బరిలో దించింది. ఇక నగర ప్రాంతం కావడం...అమరావతికి దగ్గర ఉండటం అభివృద్ధి బాగానే జరిగింది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యాయి. బలమైన క్యాడర్‌ ఇక్కడ టీడీపీ సొంతం అని చెప్పవచ్చు. కానీ గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం వలన టీడీపీకి ఆ మెజారిటీ వచ్చిందని చెప్పుకుంటారు. ఈ సారి ఆ రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తున్నాయి. దీంతో ఓట్లు చీలే అవకాశం ఉంది.


అటు గత ఎన్నికల్లో వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి సీటు అప్పిరెడ్డికే కేటాయిస్తారని అందరు అనుకున్నారు. కానీ జగన్‌ నియోజకవర్గ టికెట్ చంద్రగిరి ఏసురత్నానికి ఇచ్చారు. మరి నగర ఓటర్లు వైసీపీకి ఏ మేర మద్ధతు ఇస్తారనేది తెలియాల్సిఉంది. కానీ మిగతా పార్టీల ఓట్ల చీలిక వైసీపీకి కలిసిరావొచ్చు. మరోవైపు జనసేన పార్టీ తరపున తోట చంద్రశేఖర్ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో తోట వైసీపీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతంలోనూ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో ఈ విషయం రుజువైంది. 2009లో ప్రజారాజ్యం పార్టీకి 34 వేల ఓట్ల వరకు వచ్చాయి. మరి నగర ఓటర్లు ఈ సారి ఎవరి వైపు ఉంటారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: