కోస్తా జిల్లాలకి వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకి కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలో ఈసారి టైయాంగిల్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్ధి మాణిక్యాలరావు ఇక్కడ నుండి గెలుపొందారు. ఈ సారి పొత్తు లేకపోవడంతో అన్నీ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగాయి. టీడీపీ నుండి ఈలి నాని బరిలో ఉండగా...వైసీపీ నుండి కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. అటు జనసేన నుండి బొలిశెట్టి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ముగ్గురు నేతలకి నియోజకవర్గంపై పట్టు ఉండటంతో...ఈ సారి గట్టి పోటీ జరగనుంది.


అయితే టీడీపీ టికెట్ కోసం ముళ్ళపూడి బాపిరాజు, బొలిశెట్టి శ్రీనివాస్‌లు గట్టిగా ప్రయత్నించారు కానీ సీఎం మాత్రం ఈలి వైపు మొగ్గు చూపారు. ముళ్లపూడి బాపిరాజు పార్టీలోనే ఉన్నా.. బొలిశెట్టి మాత్రం జనసేనలోకి జంప్ అయ్యారు. ఇక ముళ్ళపూడి బహిరంగంగా నానికి మద్ధతు ఇస్తున్న...అంతర్గతంగా ఎంతవరకు సహకరిస్తారు అనేది తెలియాలి. పైగా గత మూడు పర్యాయాల నుండి టీడీపీకి ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. దీంతో క్యాడర్‌లో కొంత నిరుత్సాహం ఉంది. కానీ గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇక్కడ అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగానే అమలయ్యాయి. అలాగే ముళ్ళపూడి క్యాడర్‌ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఇక ఈలి నాని గతంలో ప్రజారాజ్యం నుండి గెలిచి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ముళ్ళపూడి వర్గం నుండి సపోర్ట్  ఏ మేర లభిస్తుందో చెప్పలేం.


అటు వైసీపీ నుండి బరిలో ఉన్న కొట్టు సత్యనారాయణకి నియోజకవర్గంపై పట్టు ఉంది. పైగా ఈ సారి ఇక్కడ వైకాపా బలపడింది. అలాగే తెదేపాలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కొట్టుకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక టికెట్ ఆశించి భంగపడ్డ వలవల బాబ్జీ...కొట్టుకి ఏ మేర సహకరిస్తారో చూడాలి. అయితే ఇక్కడ జనసేన కూడా పోటీ ఉండటం వైకాపా విజయం అంత సులువు కాదు. తెదేపాని వీడి జనసేనలో చేరి బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ కాపు ఓటర్లు ఎక్కువ ఉండటం జనసేనకి ప్లస్ అవోచ్చు. గతంలో ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది. కాబట్టి మిగిలిన రెండు పార్టీలకి సమానంగా జనసేన పోటీ ఇస్తుంది. అయితే టీడీపీ, వైసీపీకి ఉన్నంత క్యాడర్ జనసేనకి లేకపోవడం మైనస్.


ఇక గూడెం పట్టణంలో జనసేన ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్‌ మండలాల్లో టీడీపీ బలంగా ఉంది. వైసీపీ నియోజకవర్గంలో బ‌లంగా ఉన్న కొట్టు నెట్టుకొస్తాడా ? అన్న‌ది సందేహ‌మే. అలాగే సామాజికవర్గాల పరంగా చూస్తే గూడెంలో కాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ. కాపు ఓటర్లు 50వేల వరకూ ఉన్నారు. ఇక బీసీలు, ఎస్సీలు కూడా గెలుపు, ఓటములను ప్రభావితం చెయ్యనున్నారు. ఇక ఇక్కడ బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నా బీజేపీ పాత్ర పూర్తిగా నామ‌మాత్రం. కాబట్టి తెదేపా, వైకాపా, జనసేనల మధ్యే ట్రైయాంగిల్‌ ఫైట్‌ నడవనుంది. మరి ఈ హోరాహోరి పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: