రాష్ట్రంలో తెదేపాలో స్ట్రాంగ్‌గా ఉండి...మరోసారి గెలవడం పక్కా అని ఫిక్స్ అయ్యే నేతల్లో యరపతినేని శ్రీనివాసరావు ఒకరు.. 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ చేతుల మీదుగా మొదటిసారి బీ ఫారం అందుకున్న శ్రీనివాసరావు 25 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కేవలం 131 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయినప్పటికీ 2004లో చంద్రబాబు... యరపతినేనికి సీటిచ్చారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో యరపతినేని గెలుపొందారు. ఈ క్రమంలోనే వరుసగా ఆరోసారి యరపతినేని గురజాల బరిలో దిగారు.


అయితే గురజాలలో స్ట్రాంగ్‌గా ఉన్న యరపతినేనిని ఎలా అయిన ఓడించాలని అనుకుంటున్న వైకాపా...మాజీ మంత్రి కాసుకృష్ణారెడ్డి తనయుడు మహేశ్ రెడ్డిని పోటీకి దింపారు.  అయితే యరపతినేని ఇక్కడ బలంగా ఉన్నారు...వెనుక ఫుల్ సపోర్ట్ ఇచ్చే క్యాడర్ ఉంది. గత ఐదేళ్లలో అభివృద్ధి బాగానే జరిగింది. ప్రజల సమస్యలని తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తారని అన్న పాజిటివ్ వేవ్ ప్రజల్లో ఉంది. గెలిచినా..ఓడినా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉండటం ప్లస్ పాయింట్. కానీ యరపతినేనిపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో ఉన్నారని విమర్శలు రావడం కొంత మైనస్.


ఇదే సమయంలో ఇక్కడ వైకాపా కూడా బలం పుంజుకుంది. పైగా నియోజకవర్గంపై పట్టున్న కాసు కుటుంబానికి చెందిన మహేశ్ రెడ్డి పోటీ చేయడం ప్లస్. అలాగే యరపతినేని ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడారనే పేరుంది. నాన్‌లోకల్‌ అన్న ముద్ర ఇతనిపై బలంగా ఉంది. వైసీపీలో మండల స్థాయిలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. పైగా అపోజిట్ బలమైన నేత ఉన్నాడు. ఇవన్నీ ఈ పార్టీకి మైనస్‌గా చెప్పవచ్చు.ఇక్కడ జనసేన నుండి చింతలపూడి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. దీంతో ఇప్పటివరకు తెదేపాకి ఎక్కువ మద్ధతు ఇచ్చిన కాపు ఓటర్లు జనసేన వైపు తిరిగే అవకాశం ఉంది.


ఇక ఇక్కడ కాపులు, బిసీలు, ముస్లింలు గెలుపు, ఓటములను నిర్ణయించే స్థితిలో వున్నారు. కాపులు, ముస్లిం ఎటు మొగ్గితే అటు విజయం దక్కే అవకాశముంది. ముస్లిం, మైనార్టీలు 60శాతం గతంలో కాంగ్రెస్‌కు, ప్రస్తుతం వైకాపాకి అనుకూలంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ బీజేపీతో పొత్తు రద్ధు చేసుకున్న తరువాత ముస్లిం, మైనార్టీలు అధిక బాగం అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో బీసీలలో అధిక ఓటు బ్యాంక్‌ కల్గిన వడ్డెరలు టీడీపీతోనే వున్నారు. ఇక తక్కువగా ఉన్న రెడ్లు వైసీపీ వైపు ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ కొంత ఎడ్జ్ యరపతినేనికి కనపడుతుంది. కానీ ఎన్నికల సమయంలో పరిస్తుతులు ఎలా మారతాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: