అనేక ట్విస్టుల తర్వాత ఒంగోలు పార్లమెంట్ బరిలో తెదేపా...వైకాపా అభ్యర్ధులు నిలిచారు. మొన్నటి వరకు కలిసిమెలిసి ఒకే పార్టీలో పనిచేసిన సహచరులు మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగడమే ఇక్కడ హైలైట్. ఆర్థికంగా శక్తిమంతులు కావడంతో ఇద్దరూ విజయమే లక్ష్యంగా హోరాహోరీ తలపడుతున్నారు. అసలు మొదట ఒంగోలు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాగుంట పేరే ఖరారైంది. కానీ ఐటీ, సీబీఐ దాడుల భయంతో ఆయన ఆకస్మికంగా వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీకి ఈ సీటే పొందడం గమనార్హం. ఇక ఆయన్ను ధీటుగా ఎదుర్కోవడానికి చంద్రబాబు వ్యూహరచన చేశారు. దర్శి టీడీపీ అభ్యర్థి, మంత్రి శిద్దాను ఒంగోలు పార్లమెంట్ బరిలోకి దించారు. 


అటు జనసేన తన అభ్యర్థిగా బెల్లంకొండ సాయిబాబాను పోటీకి నిలిపింది. జనసేన పోటీలో ఉన్న ప్రధాన పోరు మాత్రం టీడీపీ, వైసీపీ నడుమే జరగనుంది. కాగా, గత ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నుంచి తెదేపా తరుపున గెలుపొందిన శిద్ధా రాఘవరావు...చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. దీంతో ఆయన ఏపీకి సుపరిచితులు అయిపోయారు. ఇక భారీఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు అయ్యేలా చేశారు. ఇక ఒంగోలు పార్లమెంట్ పరిధిలో బలమైన టీడీపీ కేడర్‌, నేతల్లో ఐకమత్యం ఉండటం, అసెంబ్లీ స్థానాలకు బలమైన అభ్యర్థులు ఉండటం శిద్ధాకి ప్లస్ కానుంది. అదే సమయంలో జిల్లాలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటం...వైకాపా నుండి బలమైన మాగుంట బరిలో ఉండటం మైనస్ కానున్నాయి.


అటు మాగుంట గతంలో మూడు సార్లు ఒంగోలు ఎంపీగా గెలిచి...జిల్లాపై మంచి పట్టు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో కూడా తెదేపా నుంచి పోటీ చేసి వైవీ సుబ్బారెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో సడన్‌గా వైకాపాలో చేరి ఒంగోలు పార్లమెంట్ సీటు దక్కించుకున్నారు. వైవీ సుబ్బారెడ్డిని పక్కనబెట్టి మరి జగన్ మాగుంటకి టికెట్ ఇచ్చారు. ఇక మాగుంటకి ఆర్ధిక, అంగబలం బాగా ఉంది. అటు మాగుంట కుటుంబానికి పార్లమెంట్ పరిధిలో మంచి సంబంధాలున్నాయి. ఇవన్నీ మాగుంటకి ప్లస్ కానున్నాయి. అయితే చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీలోకి మారడం, వైకాపా శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం..వైవీ సుబ్బారెడ్డి సహాయ నిరాకరణ లాంటి అంశాలు మైనస్ అవుతున్నాయి.


ఈ లోక్‌సభ స్థానం పరిధిలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఒంగోలు, కొండపి, యర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తెదేపా కనిగిరి, దర్శి, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో గెలుపొందగా...మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెంలో వైకాపా విజయం సాధించింది.  అయితే ఈసారి కనిగిరి, కొండపిలలో తెదేపా బలంగా ఉండగా...యర్రగొండపాలెం, మార్కాపురంలో వైకాపా బలం ఉంది. ఒంగోలు, దర్శి, గిద్దలూరులలో హోరాహోరీ పోరు జరగనుంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీసీలు, దళిత ఓటర్లు అత్యధికం. ఆ తర్వాత రెడ్డి సామాజికవర్గం ఎక్కువ. ఇక కమ్మ, కాపు ఓటర్లు ఇంచుమించు సమానం. అలాగే ముస్లిం, ఆర్యవైశ్య ఓటర్లు కూడా దాదాపు సమానంగా ఉన్నారు. అయితే మొన్నటివరకు ఒకే పార్టీలో ఉన్న సహచరులు...ఇప్పుడు ప్రత్యర్ధులుగా మరడంతో ఒంగోలు పోరు ఆసక్తికరంగా మారింది. ఇక ఇద్దరికీ గెలుపు అవకాశాలు సమానంగానే ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: