గత ఎన్నికల్లో తెదేపా తరుపున అమలాపురం నుంచి గెలిచిన పండుల రవీంద్రబాబు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైకాపాలో చేరడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. రవీంద్ర తెదేపాని వీడటంతో... అమలాపురం లోక్‌సభ టీడీపీ టిక్కెట్టు లోక్‌సభ దివంగత స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీష్‌ని వరించింది. ఓ తరుణంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌కు ఇవ్వాలన్న చర్చ కూడా టీడీపీలో జరిగింది. కానీ హర్షకుమార్‌కు టీడీపీ టికెట్ ఇవ్వడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో మళ్ళీ హరీష్‌కే టికెట్ వచ్చింది. దీంతో అలకబూనిన హర్షకుమార్ వెంటనే తెదేపాకి దూరం జరిగారు. ఇక టికెట్ కోసం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబుకు ఊహించని షాక్ ఎదురైంది. అమలాపురం ఎంపీ టికెట్‌ను చింతా అనురాధకి కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 


అటు జనసేన నుంచి ఓఎన్జీసీ విశ్రాంత అధికారి డీఎంఆర్‌ శేఖర్‌ పోటీ చేస్తున్నారు. ఇలా అనూహ్య పరిణామాల మధ్య మూడు పార్టీల అభ్యర్ధులు ఎన్నికల బరిలోకి దిగి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూ‌ఎస్‌ఏలో ఉద్యోగం చేస్తున్న దివంగత బాలయోగి కుమారుడు హరీష్ రాజకీయాలపట్ల ఆసక్తితో స్వరాష్ట్రం వచ్చి ఎన్నికల బరిలోకి దిగారు. విద్యావంతుడు కావడం..బాలయోగి కుమారుడు కావడం హరీష్‌కి కలిసొచ్చే అంశాలు. అలాగే అమలాపురం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలో తెదేపాకి బలమైన అభ్యర్ధులు, క్యాడర్ ఉండటం ప్లస్. యువకుడు కావడంతో ప్రజలని బాగా ఆకట్టుకుంటున్నాడు. అయితే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత రావడం...వైకాపా, జనసేనలు నుంచి గట్టి పోటీ ఎదురుకావడం కొంత ఇబ్బంది.


ఇక కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నచింతా అనురాధని జగన్ అమలాపురం బరిలో నిలిపారు.  ఆమె తండ్రి చింతా కృష్ణమూర్తికి ఇక్కడ మంచి పేరుంది.  తండ్రి పేరిట అనురాధ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి, అనేక సేవా కార్యక్రమాలు చేయడం కలిసిరానుంది. అలాగే జగన్ పాదయాత్ర తర్వాత అమలాపురంలో వైకాపా బలపడింది. ఇవి అనురాధాకి ప్లస్ అవుతాయి. అయితే ఈసారి జనసేన కూడా పోటీలో ఉండటం వలన ఏ పార్టీకి నష్టం వస్తుందో...ఏ పార్టీకి లాభం వస్తుందో చూడాలి. జనసేన నుంచి కూడా పార్లమెంట్ పరిధిలో మంచి పేరున్న విశ్రాంత అధికారి డీఎంఆర్‌ శేఖర్‌ పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కాపు ఓటర్లు ఉండటం జనసేనకి కలిసిరావొచ్చు. అయితే ప్రధాన పోరు తెదేపా-వైకాపాల మధ్యే జరిగే అవకాశం ఉంది.


అమలాపురం పార్లమెంట్ పరిధిలో రామచంద్రపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కొత్తపేటలో వైకాపా గెలవగా మిగిలిన అన్నీ స్థానాల్లో తెదేపాని గెలిచింది. అయితే ఈ సారి జనసేన కూడా పోటీలో ఉండటంతో కొన్ని చోట్ల త్రిముఖ పోరు జరగనుండగా...మరికొన్ని చోట్ల తెదేపా-వైకాపాల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇక ఈ పార్లమెంట్ పరిధిలో…ఎస్సీలు, కాపులు, బీసీ ఓటర్లు ఎక్కువ. ఇక అమలాపురం పార్లమెంట్‌ని గెలుచుకునే అవకాశాలు తెదేపా, వైకాపాలకి సమానంగా ఉన్నాయి. కానీ జనసేనఓ ఓట్ల చీలిక ప్రభావం ఎవరికి నష్టం కలిగిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: