ఎన్నికల సమయంలో పార్టీలకు ప్రతి నియోజకవర్గమూ ఇంపార్టెంటే.. కానీ కొన్ని నియోజకవర్గాలు ప్రతిష్టాత్మకం. అలాంటిదే ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గం. ఇక్కడ చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరపున బరిలో దిగడమే ఇందుకు కారణం. ఇక్కడ టీడీపీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బరిలో ఉన్నారు. 


తోడల్లుడిని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్న చంద్రబాబు.. అందుకు తగిన వ్యూహం రచిస్తున్నారు. ఏలూరికి తోడుగా మంత్రులను మోహరిస్తున్నారు. ఏలూరు గెలుపు బాధ్యతను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ లకు అప్పగించారు. దగ్గుబాటిని ఓడించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయలకూ సిద్ధమని అధిష్టానం ఏలూరికి తేల్చి చెప్పింది. 


ఇక వైసీపీ తరపున బరిలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలుపు కోసం తన అనుభవాన్ని రంగరిస్తున్నారు. ఓటరు నాడి అందుకోవటానికి గ్రామాల్లో పర్యటనలు సాగిస్తున్నారు. ఆయనకంటూ నియోజకవర్గంలో సొంత వర్గం ఉంది. నాయకులు, కార్యకర్తలతో జోరుగా సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. 

పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ అర్ధరాత్రి వేళల్లోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.  యద్దనపూడికి చెందిన మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య తనయుడు భరత్‌ పార్టీ విజయం కోసం దగ్గుబాటికి అండగా నిలవడం దగ్గుబాటికి ప్లస్ పాయింట్ గా మారింది. వైకాపా గెలుపును ఎవరూ ఆపలేరన్న ధీమా దగ్గుబాటి వర్గంలో కనిపిస్తోంది. చూడాలి మరి విజయం ఎవరిని వరిస్తుందో. 



మరింత సమాచారం తెలుసుకోండి: