వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు చిక్కుముడి ఇంకా వీడనేలేదు. ఈ కేసులో పోలీసులు తాజాగా ముగ్గురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినా.. హంతకుల సంగతి మాత్రం బయటపెట్టలేదు. కానీ ఈ హత్య కేసుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది. 

వైఎస్ హత్య జరిగింది పులివెందులలో.. తిరుపతిలో హరిత హోటల్ ఉంది.. కానీ ఈరెండింటికీ లింకు ఉందని కథనాలు వస్తున్నాయి. వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి వ్యక్తప‌రుస్తున్న అనుమానాలే ఇందుకు ఆధారం.  వివేకానంద‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిన‌ని చెప్పుకునే ప‌ర‌మేశ్వరరెడ్డి చికిత్స కోస‌మంటూ హత్యకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఆసుప‌త్రిలో చేర‌డం అనుమానాలకు తావిస్తోందని సునీతారెడ్డి చెప్పారు. 

అంతే కాదు.. హత్యకు సరిగ్గా ఒకరోజు ముందు.. ఆసుపత్రిలో చేరిన ప‌ర‌మేశ్వరరెడ్డి పదే పదే ఫోన్ వాడుతున్నాడని.. చెస్ట్ పెయిన్ పేరుతో ఆస్పత్రిలో చేరిన ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డికి, అస‌లు చెస్ట్ పెయిన్ లేదని వైద్యులు ఇచ్చిన రిపోర్టుల‌లో తేలింద‌ని సునీతా చెప్పారు.  ఆస్పత్రిలో ఉన్న  ప‌ర‌మేశ్వర రెడ్డిని బ‌య‌ట‌కు వెళ్లొద్దని వైద్యులు ఎంత చెప్పినా విన‌కుండా గొడ‌వ‌పెట్టుకుని మ‌రీ బ‌య‌ట‌కు వెళ్లాడట.

అలా బ‌య‌ట‌కు వెళ్లిన ప్రతీసారి ఆయన తిరుపతిలోని హ‌రిత హోట‌ల్‌కు వెళ్లాడ‌ని...  ఆ హోట‌ల్‌లో ప‌ర‌మేశ్వరరెడ్డి ఎవ‌రెవ‌రిని క‌లిశారు..? ఎంత సేపు ఉన్నారు..? అస‌లు హ‌రిత హోటల్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది..? అని ప్రశ్నిస్తున్నారు సునీతారెడ్డి. హత్య జరిగిన రోజు ఉదయం నాలుగున్నరకు పరమేశ్వరరెడ్డి వద్దకు ఓ వ్యక్తి వచ్చి ఫోన్‌లో కొన్ని వీడియోలు చూపించి వెళ్లాడట. మరి ఆ వ్యక్తి ఎవరు.. ఏం చూపించాడు.. తిరుపతి హరిత హోటల్లో ఏం జరిగింది.. ఇవన్నీ సిట్ తేల్చాల్సిన చిక్కుముడులు.



మరింత సమాచారం తెలుసుకోండి: