గుంటూరు జిల్లాలో ట్రైయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం ఉన్న మరో నియోజకవర్గం ప్రత్తిపాడు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి రావెల కిశోర్ బాబు గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు, కుటుంబ వ్యవహారాల కారణంగా త్వరగానే ఆ పదవిని కోల్పోయారు. ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యేగా ఉంటూనే టీడీపీకి దూరమవుతు వచ్చారు. చివరికి జనసేనలో చేరి ఆపార్టీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇక రావెల వెళ్లిపోవడంతో జిల్లాలోని సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని టీడీపీ తర‌పున పోటీలో పెట్టారు. ఇక వైసీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత బరిలో ఉన్నారు.


సౌమ్యుడుగా, విద్యావంతుడుగా నియోజకవర్గంలో డొక్కాకి మంచి పేరుంది. జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం అయిన ప్రత్తిపాడు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుంది. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ఇక డొక్కా రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావుకి ఇక్కడ అనుచరవర్గం బాగానే ఉంది. వారి మద్ధతు కూడా డొక్కాకి పుష్కలంగా ఉంది. కానీ టికెట్ ఆశించి భంగపడ్డ కందుకూరి వీరయ్య వర్గం డొక్కాకి ఏ మేర సహకరిస్తారనేది చూడాలి.
అటు 2009లో కాంగ్రెస్ నుంచి, 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన మేకతోటి సుచరిత 2014 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక ఈ సారి ఎన్నికల్లో ఆమె మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేస్తుంది. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం..ఓడిపోయిన సానుభూతి సుచరితకి ప్లస్ కానున్నాయి. 


అలాగే వైసీపీ బలపడటం...ప్రభుత్వ వ్యతిరేకత లాంటి అంశాలు తన గెలుపుకి సహకరిస్తాయని సుచరిత ధీమాగా ఉన్నారు. కానీ జనసేన పోటీలో ఉండటం...టీడీపీ నుంచి డొక్కా బరిలో ఉండటం వలన సుచరిత గెలుపు అంత సులువు కాదు. నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ట్టిచెరుకూరు, ప్ర‌త్తిపాడు, కాకుమాను, ప్ర‌త్తిపాడు మండ‌లాలు టీడీపీకి ప్ల‌స్‌గా ఉన్నా ఎక్కువ ఓటింగ్ ఉన్న గుంటూరు రూర‌ల్ మండ‌లం అభ్య‌ర్థుల గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌నుంది. ఈ మండ‌లంలో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువుగా ఉండ‌డంతో ఈ మండ‌లంలో టీడీపీకి ఎక్కువుగా మైన‌స్ క‌న‌ప‌డుతోంది. అదే టైంలో ఇక్క‌డ వైసీపీ, జ‌న‌సేన ప్ర‌భావం చూపున్నాయి. 


ఇక జనసేన తరుపున రావెల కిషోర్ బాబు పోటీ చేస్తున్నారు. కాపుల ఓట్లు, పవన్ ఇమేజ్ మాత్రమే రావెలకి ప్లస్, ఈ నియోజకవర్గంలో ఎస్సీలు సుమారు 60 వేలతో ఎక్కువగా వున్నారు. ఆ తరువాత కమ్మ సామాజిక వర్గం ఓట్లు 55 వరకు ఉన్నాయి. కాపు సమాజిక వర్గం ఓట్లు 40వేలు ఉన్నాయి. ఈ మూడు సామాజికవర్గాలే ఎక్కువగా అభ్యర్ధుల గెలుపోటములని ప్రభావితం చేస్తాయి. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ-వైసీపీల మధ్య గట్టి ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. కానీ జనసేన చీల్చే ఓట్ల ప్రభావం వలన ఏ పార్టీకి నష్టం కలుగుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: