కృష్ణా జిల్లాకి  సరిహద్దుగా..గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో విస్తరించి ఉన్న నియోజవర్గం రేపల్లె...టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 5 సార్లు తెదేపా..3 సార్లు కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇక గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధి అనగాని సత్యప్రసాద్ గౌడ్...వైకాపా అభ్యర్ధి మోపిదేవి వెంకటరమణపై విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో కూడా వీరిద్దరే మళ్ళీ పోటీలో ఉన్నారు. జనసేన నుంచి కమతం సాంబశివరావు బరిలో ఉన్నారు. గత ఐదేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అనగాని.. అభివృద్థి కార్యక్రమాలతో దూసుకెళ్లారు. అలాగే మునుపెన్నడూ లేని విధంగా ఇక్కడ ప్రజలకి సంక్షేమ ఫలాలు అందాయి. ఇక్కడ బలమైన కేడర్ టీడీపీ సొంతం...అడిగిన వెంటనే సమస్యలు పరిష్కరించడంతో ప్రజల్లో ఎమ్మెల్యేకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇవే ఈ ఎన్నికల్లో అనగానికి పాజిటివ్ అంశాలు కానున్నాయి. 


అనగాని సోదరుడు శివ ప్రసాద్‌ తీరుపై క్యాడర్‌లో కొంత అసంతృప్తి ఉంది. నోటి దురుసుతో పార్టీ శ్రేణులను దూరం చేసుకున్నారనే విమర్శ ఉంది. అలాగే అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉండటం మైనస్. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి ఎక్కువైంద‌న్న విమ‌ర్శ‌లూ ఉన్నాయి. మరోవైపు 2009లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన మోపిదేవి వెంకటరమణ...2014 వైసీపీ తరుపున పోటీ చేసి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచే మరోసారి రేపల్లె బరిలో నిలబడ్డారు. ఓడిపోయిన తర్వాత ప్రజలకి అందుబాటులో లేకపోయిన... గత ఏడాది కాలంగా ఇక్కడి నాయకులను కలుపుకొని పోతున్నారు. అదేవిధంగా నియోజకవర్గంపై పట్టు ఉన్న దేవినేని మల్లిఖార్జున‌రావు ఇటీవ‌ల వైసీపీలో చేరారు. ఆయ‌న‌ సహకరిస్తే వైసీపీకి ప్లస్ అవుతుంది. 


ప్రభుత్వ వ్యతిరేకత...ఎమ్మెల్యే తమ్ముడి చర్యలు తమ పార్టీకి లాభిస్తాయని మోపిదేవి ధీమాగా ఉన్నారు. కానీ గతంలో అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లొచ్చిన మోపిదేవి పట్ల..ఇంకా ప్రజల్లో సానుకూలత రాలేదు.  దీనికి తోడు ఆయన తమ్ముడు హరనాధ్‌బాబు తీరు వైసీపీకి చేటు చేసే విధంగా ఉంది. అటు కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటం జనసేనకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఆ పార్టీ అభ్యర్ధి కమతం సాంబశివరావు...టీడీపీ-వైసీపీ అభ్యర్ధులకి ఏ మేర పోటీ ఇవ్వగలరో చూడాలి. ఈ నియోజకవర్గంలో గౌడ, కాపు ఓటర్లు ఎక్కువగా ఉంటారు. వీరే గెలుపుని డిసైడ్ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం అయితే ఇక్కడ అనగానికే కాస్త ఎడ్జ్ ఉంద‌ని అనుకుంటున్న టైంలో నియోజ‌క‌వ‌ర్గంలో మంచి అనుచ‌ర‌గ‌ణం ఉన్న దేవినేని మ‌ల్లిఖార్జునరావు అనూహ్యంగా వైసీపీలోకి రావ‌డంతో ప‌రిస్థితి మారిన‌ట్టు క‌నిపిస్తోంది.  ఇదిలా ఉంటే జనసేన ఓట్ల చీలిక ప్రభావం ఎవరికి నష్టం చేకూరుస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: