రాష్ట్రంలో టీడీపీకి బలమైన అభ్యర్ధులు ఉన్న స్థానాల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి సీనియర్ నేత కింజరపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు రాష్ట్రమంత్రిగా పని చేశారు. అయితే గత ఎన్నికల్లోనే వైసీపీ నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కున్న అచ్చెన్నా...ఈ సారి కూడా వైసీపీ, జనసేన అభ్యర్ధుల నుంచి గట్టి పోటీనే ఎదుర్కునేలా కనిపిస్తోన్నారు. ఇక ఈ ఐదేళ్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా టెక్కలిలో మంచి అభివృద్ధే చేశారు. అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యాయి. పైగా నియోజకవర్గంలో ఉన్న కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో అచ్చెన్నా హవా ఎక్కువగా ఉంది. అటు కొంత వీక్‌గా ఉన్న నందిగం, టెక్కలి మండలాల్లో మంత్రిగా అభివృధ్ధి కార్యక్రమాలు ఎక్కువ చేపట్టి ఓటుబ్యాంకు కొంతవరకు పెంచుకున్నారు.  అయితే అచ్చెన్నాపై అవినీతి ఆరోపణలు రావడం కొంత ఇబ్బందికర పరిణామం.


మరోవైపు వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్‌ను కాకుండా .. పేరాడ తిలక్‌ను టెక్కలి బరిలో దించారు. గతంలో కంటే వైసీపీ ఇక్కడ బలపడింది. పైగా తిలక్‌కి ధర్మాన ప్రసాదరావు మద్ధతు గట్టిగానే ఉంది. అలాగే తిలక్ కళింగ సామాజికవర్గానికి చెందిన వాడు కావడం ప్లస్. అయితే బలమైన నాయకుడుగా ఉన్న అచ్చెన్నాయుడిని ఎదుర్కోవడం తిలక్‌కి కష్టమే. అటు జనసేన కూడా ఇక్కడ కొంత బలంగానే ఉంది. ఆ పార్టీ అభ్యర్ధిగా కణితి కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. పవన్ కూడా అచ్చెన్నాని టార్గెట్ చేసుకుని ప్రచారం కూడా చేశారు.


ఇక ఇక్కడ కళింగ ఓటర్లు ఎక్కువ. వీరే 70 వేల వరకు ఉన్నారు. అలాగే  వెలమ, యాదవ, కాపు, రెడ్డి,  వైశ్య, ఎస్సీ, ఎస్టీలు కూడా ఎక్కువగానే ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి కళింగ కాగా, అచ్చెన్నా వెలమ సామాజివర్గ నేత..అయితే గత ఎన్నికల్లో కళింగులు అచ్చెన్నాకే మద్ధతు ఇచ్చారు. కానీ ఈ సారి ఆ పరిస్తితి ఎక్కువ లేదనే చెప్పాలి. పైగా ఇప్పుడు జనసేన పోటీలో ఉంది. వీరికి కాపు ఓటర్ల మద్ధతు ఉంది. దీంతో అచ్చెన్నాకి వైసీపీ, జనసేన అభ్యర్ధులు గట్టి పోటీ ఇస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే అచ్చెన్నా, తిలక్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం..విజయం సాధించే అవకాశాలు ఇద్దరికీ సమానంగానే ఉన్నాయి. జిల్లా మంత్రిగా ఉన్న అచ్చెన్న మెజార్టీ నిధులు టెక్క‌లికి తీసుకువెళ్లిపోయార‌న్న టాక్ ఉంది. మరి ఎన్నికల సమయంలో చోటు చేసుకునే పరిణామాలు బట్టి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: