టీడీపీ కంచుకోట‌గా చెప్పుకునే త‌ణుకులో ఈ సారి పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ‌..వైసీపీ అభ్య‌ర్థి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర్‌రావుతోపాటు జ‌న‌సేన నుంచి పసుపులేటి వెంక‌ట‌రామారావు బ‌రిలో ఉండ‌టంతో త్రిముఖ పోరు కొన‌సాగ‌నుంది. కాపులు, బీసీలు, ఎస్సీల ఓట్లు బ‌లంగా ఉండ‌టంతో మూడు సామాజిక‌వ‌ర్గాల్లోని ఏదేని రెండు సామాజిక వ‌ర్గాల ఓట‌ర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో అభ్య‌ర్థి విజ‌యం ఖాయం అన్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. క‌మ్మ‌లు ఇక్క‌డ రాజ‌కీయంగా కీల‌కంగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే.  


టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ రూ.1300 కోట్ల‌తో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వివిధ అభివృద్ధి ప‌నులు  చేప‌ట్టారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తారురోడ్లు, మ‌రుగుదొడ్ల నిర్మాణం, పాఠ‌శాల‌ల‌కు భ‌వ‌నాల నిర్మాణం, వంతెన‌ల నిర్మాణంతో పాటు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తీ సంక్షేమ ప‌థ‌కం అర్హులైనవారంద‌రికీ చేరేలా కృషి చేశారు. దీంతో స‌హ‌జంగానే ఆయ‌న‌కు కొంత ఎడ్జ్ ఉంద‌ని చెప్పాలి. పార్టీలో కూడా పెద్ద‌గా లుక‌లుక‌లు లేవు. సౌమ్యుడు అంద‌రినీ క‌లుపుకుపోతాడు..వివాద‌ర‌హితుడిగా పేరుంది. ఇవి ఆయ‌న‌కు బ‌లాన్ని చేకూర్చుతున్నాయి. 


వైసీపీ నుంచి బ‌రిలో ఉన్న కారుమూరి నాగేశ్వ‌ర్‌రావు బీసీ నేత‌. ఈయ‌న గ‌తంలో ఇక్క‌డ ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలోని వివిధ సంఘాల నేత‌లు, పార్టీల్లోని నేత‌ల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధాలున్నాయి. కారుమూరి qఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో చెప్పుకోద‌గ్గ రీతిలోనే అభివృద్ధి జ‌రిగింది.


గ‌త ఎన్నిక‌ల్లో చివ‌ర్లో అనూహ్యంగా వైసీపీలోకి జంప్ చేసి దెందులూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన కారుమూరి ఆ త‌ర్వాత త‌ణుకు వైసీపీ ప‌గ్గాలు చేప‌ట్టారు. చాలా కాలం నుంచి ఆయ‌న పార్టీ నిర్మాణాన్ని చ‌క్క‌బెట్టుకుంటూ వ‌స్తున్నారు. వైసీపీకి కొంత క్యాడ‌ర్ తీసుకువ‌చ్చారు. అయితే కొంత అస‌మ్మ‌తి సెగ‌మాత్రం ఉంది. అంద‌రిని స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయించుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు స‌మాచారం. ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే బ‌రిలో ఉన్న వెంక‌ట‌రామారావు రాజ‌కీయాలకు కొత్త‌గా చెప్పుకోవాలి. ప్రజ‌ల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధాలు త‌క్కువేన‌ని చెప్పాలి. అయితే జ‌న‌సేన సీటు ఆశించిన మిగిలిన నాయ‌కుల నుంచి ఆయ‌న‌కు స‌రైన రేంజ్‌లో స‌పోర్ట్ లేదు. 


అయితే కాపుల ఓట్లు అత్య‌ధికంగా ఉండ‌టం ఆయ‌న‌కు కొంత క‌ల‌సివ‌స్తుంద‌ని, అదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మేనియా ప‌నిచేస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోన్న త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి మార్పు ఉంటుదా..?   లేక అదే పార్టీ జైత్ర‌యాత్ర కొన‌సాగుతుందా..? అనేది వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: