ఎన్నిక‌ల వేళ ఏ రాజ‌కీయ పార్టీలో అయినా నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చాలా అవ‌స‌రం. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు క‌లిసి క‌ట్టుగా ప‌నిచేస్తేనే త‌ప్ప పార్టీల అభ్య‌ర్థులు గ‌ట్టెక్కే ప‌రిస్థితి లేదు.ఈ విష‌యంలో ఏ మాత్రం తేడా వ‌చ్చినా కూడా.. అభ్య‌ర్థులు ఎంత‌టి గెలుపు గుర్రాలే అయినా.. ఓట‌మి బాట‌ప‌ట్ట‌డం ఖాయం. అందుకే ఆయా పార్టీల అధినేత‌లు సాధ్య‌మై నంత వ‌ర‌కు కూడా అభ్య‌ర్థుల మ‌ధ్య ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకుంటారు. అయితే, తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు పార్టీ ప‌రువు తీసేలా ఉన్నాయ‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. 


చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీవ‌ర్గానికి కేటాయించారు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పీత‌ల సుజాత టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు ఆమెను ప‌క్క‌న పెట్టి క‌ర్రా రాజారావు ను రంగంలోకి దింపారు. అయితే, పీత‌ల సుజాత ఉన్న స‌మ‌యంలో పార్టీలో వ‌ర్గ పోరు నెల‌కొంద‌ని ఇక్క‌డి నేత‌ల అభిప్రాయం. తాజాగా ఇక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న టీడీపీ నాయ‌కుడు, ప్ర‌ముఖ వ్యాపార వేత్త అంబికా కృష్ణ.. తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పీత‌ల సుజాత ఇక్క‌డ పార్టీని నాశ‌నం చేశార‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ర‌చ్చ‌కు దారితీశాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని జంగారెడ్డి గూడెంలో ఆర్య వైశ్యుల స‌మావేశం జ‌రిగింది. 


దీనికి ముఖ్య అతిథిగా అంబికా కృష్ణ హాజ‌రై ప్ర‌సంగించారు. ఈ స‌మ‌యంలో కొంద‌రు కార్య‌క‌ర్త‌లు పీత‌ల‌ను వ్య‌క్తిగ‌తంగా కూడా విమ‌ర్శించారు. ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించింది ఏమీలేద‌ని, చేసింది కూడా ఏమీ లేద‌ని, ఎవ‌రినీ ప‌ట్టించు కోలేద‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామం ఒక్క‌సారిగా అగ్గిని రాజేసింది. టీడీపీ రెండుగా చీలిపోయింది. పీత‌ల‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గం వ్య‌తిరేకించే వ‌ర్గాలుగా మారిపోయిన త‌మ్ముళ్లు బాహా బాహీకి దిగాయి. దీంతో స‌భ సైతం ర‌సాబాస‌గా మారిపోయింది. ఈ ప‌రిణామాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీపై ఒక‌విధ‌మైన వ్య‌తిరేకత వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి ఇలా ఉంటే.. టీడీపీ గెలిచేనా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: