పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సారి త్రిముఖ పోరు జరిగే స్థానాల్లో ఆచంట కూడా ఉంటుంది. ఇక్కడ మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలను సాధించి మంత్రిగా కొనసాగుతున్న పితాని సత్యనారాయణ..మరోసారి టీడీపీ నుంచి బరిలో ఉండగా...ఎలాగైనా ఈసారి పితానికి చెక్ పెట్టాలని ఉద్దేశంతో బలమైన నేత చెరుకువాడ శ్రీరంగనాథ రాజుని బరిలోకి దించింది. ఇక వీరిద్దరికి మేము పోటీ ఇస్తామని చెప్పి జనసేన జవ్వాది వెంకట విజయరామ్‌ని ఆచంట పోరులో దించింది. దీంతో ముగ్గురు అభ్యర్ధుల మధ్య త్రిముఖ పోరు జరగడం ఖాయమైంది. ఎంత త్రిముఖ పోరు జరుగుతున్న... అసలు పోరు మాత్రం టీడీపీ-వైసీపీల మధ్యే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలా అని జనసేననీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.


2014లో టీడీపీ తరుపున గెలిచి మంత్రి అయిన పితాని...నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధే చేశారు. కార్మిక మంత్రిగా చంద్రన్న భీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. వీటితో పాటు మిగతా సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఎన్నికల్లో ఇస్తున్న హామీలు పితానికి గెలుపుకి కొంత సాయం అవ్వొచ్చు. అయితే శెట్టిబలిజ వర్గం వలనే పితాని వరుసగా మూడు సార్లు గెలవగలిగారు. అయితే పితానికి ఈసారి క్యాస్ట్ పాలిటిక్స్ చేసే అవకాశం అంతగా కనిపించడంలేదు. ఆయనకి ఎప్పుడు మద్ధతు ఇస్తున్న శెట్టిబలిజ వర్గంలో చీలిక వచ్చింది. ఇది చాలావరకు పితానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పితాని వెంటనే ఈ డ్యామేజ్‌ని సరిచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ, శెట్టిబలిజల్లో కాస్తో కూస్తో పట్టున్న మల్లు లక్ష్మీనారాయణని తిరిగి టీడీపీలోకి తీసుకొచ్చారు. అయినా ఆ వర్గంలో కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తోంది, దీనికి తోడు కాంగ్రెస్ నుంచి వచ్చిన పితాని పాత టీడీపీ కేడర్‌ని పట్టించుకోపోవడం వలన...వారిలో కూడా అసంతృప్తి ఉంది. మరి ఈ వ్యతిరేకతని ఎన్నికల సమయానికి ఏ మేర తగ్గించుకుంటారో చూడాలి.


మరోవైపు వైసీపీ అభ్యర్ధి శ్రీరంగనాథ రాజు బాగా బలంగా ఉన్నారు. ఎన్నికలకీ 6 నెలల ముందు నుంచే నియోజకవర్గంలో పని చేస్తూ వస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆర్ధికంగా బలంగా ఉండటంతో ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడటంలేదు. అన్నీ సామాజికవర్గాలని ఆకర్షిస్తూ కార్యక్రమాలు చేశారు. ఎన్నికల ప్రచారంతో పాటు..పదునైన రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అయితే జనసేన పోటీ లేకపోతే విజయం శ్రీరంగనాథ రాజునే వరించేదని నియోజకవర్గంలో చర్చ కూడా నడిచింది. ఇక్కడ జనసేన కూడా బలంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్ధి జవ్వాది విజయరామ్‌కి కొంత కాపు ఓట్లు, పవన్ ఇమేజ్ కలిసొచ్చే అవకాశం ఉంది.  దీని వలనే మిగతా రెండు పార్టీలతో పాటు పోటీలో నిలవగలిగింది.


నియోజకవర్గంలో బీసీ ఓటర్లలో గౌడ, శెట్టిబలిజ వారు ఎక్కువగా ఉన్నారు. వీరు సుమారు 52 వేల వరకు ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీలో మాల, మాదిగ కలిపి 35 వేలు వరకు ఉన్నారు. అలాగే  కాపు 22 వేలు, రెడ్డి 13 వేలు, క్షత్రియ 6 వేలు, కమ్మ 6 వేలు ఓట్లు ఉన్నాయి. అయితే ఎక్కువ ప్రభావం శెట్టిబలిజ, గౌడలదే ఉంటుంది. వీరు గత మూడు పర్యాయాలు పితానికే మద్ధతు తెలిపారు కానీ ఇప్పుడు ఆ పరిస్తితి కనబడటం లేదు. వీరిలో కొందరు వైసీపీకి మద్ధతు పలుకుతున్నారు. ఇక ఎస్సీలు, రెడ్లు ఎక్కువ వైసీపీ వైపు ఉండొచ్చు, కమ్మ టీడీపీకే మద్ధతు. కాపులు టీడీపీకి, జనసేనకి ఉండొచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటివరకు సులువు గెలుస్తున్న పితాని విజయం ఈ సారి అంత సులువు కాదు. వైసీపీ అభ్యర్ధి గట్టి పోటీ ఇస్తున్నారు. జనసేన కూడ పోటీలో ఉన్నా.... విజయం మాత్రం టీడీపీ-వైసీపీ అభ్యర్ధులలోఒకరికి దక్కడం ఖాయం. మరి చూడాలి మళ్ళీ ఆచంట పితాని సొంతమవుతుందో లేక పితానికి చెక్ పెట్టి వైసీపీ కైవసం చేసుకుంటుందో. 


మరింత సమాచారం తెలుసుకోండి: