గుంటూరు జిల్లా పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఎత్తున ఫైట్ జ‌రుగుతోంది. ఇక్క‌డ నుంచి ప్ర‌ధానంగా మూడు పా ర్టీలు హోరా హోరీ త‌ల‌ప‌డుతు న్నాయి.  వీరిలో ఒక మ‌హిళా నేత ఉండ‌డం మ‌రింత స్పెష‌ల్‌. అదేస‌మ‌యంలో మూడు పార్టీల నుంచి బ‌రిలోకి దిగిన ముగ్గురు నాయ‌కులు కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ప్ర‌జ‌ల మ‌నిషిగా నిలుస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. పెద‌కూర‌పాడు నుంచి వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్నారు టీడీపీ నాయ‌కుడు కొమ్మాలపాటి శ్రీధ‌ర్‌. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు కూడా చేరువ‌య్యారు. 


ఈ క్ర‌మంలో గెలుపు గుర్రంగా మారి 2009లో వైఎస్ హ‌వాలోనూ, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యం సాధించారు. ఇక‌, ఈయ‌న కృషిని మెచ్చుకున్న చంద్ర‌బాబు మ‌రోసారిఇప్పుడు కూడా కొమ్మాల‌పాటికే అవ‌కాశం క‌ల్పించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తూ 2014 ఎన్నికల్లో మరోసారి పోటీచేసి 9,086 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడోసారి ఎన్నికల బరిలో ఉన్న కొమ్మాలపాటి హ్యాట్రిక్‌ విజయం సాధించే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇక్కడున్న ప‌రిచ‌యాలు, టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, చంద్ర‌బాబు కృషి వంటివి త‌న‌ను గెలిపిస్తాయ‌ని శ్రీధ‌ర్ అంటున్నారు. 


ఇక, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ త‌రఫున కూడా క‌మ్మ వ‌ర్గానికే చెందిన నంబూరి శంక‌ర‌రావు ఇక్క‌డ నుంచి పోటీకి దిగారు. ఈయ‌న కూడా ఆర్థికంగా బ‌ల‌వంతుడే కావ‌డంతో  ఖ‌ర్చుకు వెనుకాడ‌డం లేదు. దీంతో ఎన్నిక‌ల్లో ఆయ‌న కూడా గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినా తన‌దైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు పోతున్నారు. టీడీపీ, వైసీపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంటుంద‌ని అంటున్నారు. ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున విద్యావంతురాలు, క‌మ్మ వ‌ర్గానికే చెందిన‌ పుట్టి లక్ష్మీసామ్రాజ్యం బ‌రిలో నిలిచారు. దీంతో ముచ్చ‌ట‌గా మూడు పార్టీల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. వీరికి ప్ర‌ధానంగా క‌లిసి వ‌స్తున్న అంశం. ముగ్గురూ క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారే. ముగ్గురూ ఆర్థికంగా బ‌లవంతులే. 


అదే స‌మ‌యంలో జ‌న‌సేన కు మ‌హిళా సెంటిమెంట్ ఓట్లు ప‌డే ఛాన్స్ లేదా చీల్చే ఛాన్స్ రెండూ ఉన్నాయి. అయితే,  సిట్టింగ్‌ ఎమ్మెల్యే  కొమ్మాలపాటి ఐదేళ్ల కాలంలో ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతోపాటు ప్రజలకు అం దుబాటులో ఉండడం లాంటి అంశాలు కలిసివస్తాయని అంటున్నారు. ప్రధానంగా మహిళలు, రైతులు, ఎస్సీ, బీసీ, ముస్లింలకు అందించిన ప్రభుత్వ పథకాలతో కొమ్మాలపాటి ఘన విజయం సాధిస్తారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీకి సంప్రదాయ ఓట్లతోపాటు ఎస్సీ, మైనార్టీల మద్దతు ఉంటుందని ఆ పార్టీవర్గాలు అంటున్నా యి. జనసేన అభ్యర్థి లక్ష్మీసామ్రాజ్యం... పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌, వామపక్షాలు, బీఎస్పీ మద్దతుతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మ‌రి ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు నిలుస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: