రాష్ట్రంలో హాట్ ఫైట్ జరిగే పార్లమెంట్ సీటు ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. ఎందుకంటే ఇక్కడ నాలుగు ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్ధులు తలపడుతున్నారు. టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, దివంగత ఎం‌వి‌వి‌ఎస్ మూర్తి మనవడు భరత్ పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి బిల్డర్, సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఇక అనూహ్యంగా జనసేనలో చేరి సి‌బి‌ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ బరిలో బస్తీమే సవాల్ అంటున్నారు. బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి బరిలో దిగుతున్నారు. పైగా భరత్, పురంధేశ్వరి ఇద్దరూ బంధువులు కావడంతో విశాఖ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే పురంధేశ్వరి మినహా మిగతా ముగ్గురు అభ్యర్థులు ఎన్నికలకు కొత్త వారే. వీరిలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కాగా.... భ‌ర‌త్‌, ఎంవీవీ.స‌త్య‌నారాయ‌ణ‌, పురందేశ్వ‌రి ముగ్గురూ క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారే. 


టీడీపీ నుంచి బరిలో ఉన్న భరత్ ఎన్నికలకీ కొత్త అయినా...రాజకీయాలకి కొత్త కాదు. ఆయన తాత మూర్తికి విశాఖలో మంచి పేరే ఉంది. భరత్ కూడా గీతం విద్యాసంస్థలని సమవర్ధవంతంగా నడిపిస్తునే...రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అటు మావయ్య బాలయ్య అండదండలు...మరో తాత కావూరి సాంబశివరావు ఆశీర్వదాలు భరత్‌కి పుష్కలంగా ఉన్నాయి. అలాగే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు బలంగా  ఉండటం... క్షేత్రస్థాయిలో టీడీపీకి బలమైన కేడర్ ఉండటంతో పాటు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సైతం భరత్‌కి కలిసొస్తాయి.


ఇక జనసేన అభ్యర్థి జెడీ లక్ష్మినారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలోని అందరికీ ఈయన గురించి తెలుసు. వ్యక్తిగతంగా ఉన్నత విద్యావంతుడు కావడం.. నిజాయతీ గల అధికారిగా పేరుండటం వలన పార్టీలకి అతీతంగా ప్రజలు జేడీకి మద్ధతు తెలిపే అవకాశం ఉంది. పైగా నగరంలో ఉండే యువతలో ఎక్కువగా విద్యావంతులే కావడంతో వారంతా జనసేన వెంటే ఉంటారని ధీమా జనసేనలో కనిపిస్తోంది. పైగా లక్ష్మీనారాయణ రూపాయి ఖర్చు కాకుండా నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేయటం, వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ తాను ఏం చేయగలనో వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక పవన్ ఇమేజ్ కూడా జేడీకి ప్లస్ అవ్వనుంది.


మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ...ఆర్ధికంగా బలవంతుడు...ఈయనకి వైజాగ్‌లో సొంత అపార్ట్‌మెంట్స్ చాలా ఉన్నాయి. అందులో ఉండే వారి మద్ధతు ఎంవీవీకే ఉండొచ్చు. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని వైసీపీ నేతలు చెబున్నారు. అయితే గ్రామీణ ప్రాంత ఓటర్లతో పాటు మధ్య తరగతి కుటుంబాలు అధికంగా ఉండే శృంగవరపు కోట,  భీమిలి నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభావం చూపే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ఎంవీవీ కూడా క‌మ్మ వ‌ర్గానికే చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ వ‌ర్గం ఓట‌ర్ల‌ను కూడా చీల్చే ఛాన్స్ ఉంది. 


అటు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి...2004, 2009లో విశాఖ నుంచే కాంగ్రెస్ తరుపున ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆమెకు విశాఖపై కాస్తా పట్టుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్‌, స్మార్ట్‌ సిటీగా ప్రకటించడం తదితర అంశాలు బీజేపీకి ప్లస్అవ్వొచ్చు. పైగా ఇక్కడ కేంద్ర సంస్థల్లో పని చేస్తున్న ఉత్తరాది ఓటర్లు బీజేపీకే మద్ధతు తెలిపే అవకాశం ఉంది. కానీ బీజేపీకి గెలిచే అంత కెపాసిటీ లేదని మాత్రం అర్ధమవుతుంది.


ఈ పార్లమెంట్ పరిధిలో విశాఖ ఈస్ట్,వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, భీమిలి, ఎస్ కోట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ అన్నీ స్థానాల్లో టీడీపీనే గెలిచింది. అయితే టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ నార్త్‌లో గెలిచింది. కానీ ఈ సారి టీడీపీ-వైసీపీ-జనసేనల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇక విశాఖ పరిధిలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాత యాదవులు, వెలమలు, గవర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే విశాఖ నగరానికొచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా వున్నందున ఉద్యోగ, వ్యాపార రీత్యా వచ్చిన ఉత్తరాది ప్రాంతాల వారు, మార్వాడీలు, తమిళులు, కేరళీయలు ఇలా అంతా వున్నారు.

ఈ సారి ఎవరు వన్ సైడ్‌గా ఓట్లు వేసే అవకాశం కనిపించడంలేదు. ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే టీడీపీ-జనసేన-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. బాల‌య్య అల్లుడు భ‌ర‌త్ పూర్తిగా త‌న తాత ఇమేజ్‌తో పాటు ఎమ్మెల్యే అభ్య‌ర్థుల మీదే ఆధార‌ప‌డి నెట్టుకొచ్చేస్తున్నారు. క‌మ్మ వ‌ర్గం పోల్ మేనేజ్‌మెంట్‌పై భ‌ర‌త్ ఆశ‌లు పెట్టుకున్నా వైసీపీ, బీజేపీ అభ్య‌ర్థులు కూడా అదే వ‌ర్గానికి చెందిన వాళ్లు కావ‌డంతో భ‌ర‌త్‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: