శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం...ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట... 1983 నుంచి 1999 వరకు టీడీపీదే ఇక్కడ అధికారం. టీడీపీ తరుపున గుండ అప్పల సూర్యనారాయణ వరుసగా నాలుగుసార్లు విజేతగా నిలిచారు. అయితే 2004, 09 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి టీడీపీ బరిలో దిగి విజయం సాధించారు. వైసీపీ తరుపున బరిలోకి దిగి ధర్మాన పరాజయం పాలయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా వీరిద్దరే మళ్ళీ తలపడుతున్నారు. జనసేన నుంచి కోరాడ సర్వేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన మాత్రం టీడీపీ-వైసీపీల మధ్యే జరగనుంది.


2014లో భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయిన లక్ష్మీదేవి...నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి చేశారు. అటు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేశారు. అలాగే స్మార్ట్‌ సిటీ, ‘అమృత్‌’లో భాగంగా ఇంటింటికీ తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. మహిళా ఎమ్మెల్యే కావడంతో...ప్రత్యక్షంగా ప్రజల దగ్గరకి వెళ్ళి వారి సమస్యలని తెలుసుకుని పరిష్కరించడంలో ముందున్నారు. అయితే ఎమ్మెల్యే పేరు చెప్పి స్థానిక దందాలు చేశారనే ఆరోపణలు రావడం ఇబ్బందికరంగా మారే పరిస్తితి నెలకొంది. అలాగే పార్టీలో కొందరు నేతలు వైఖరి కారణంగా...కేడర్ కొంత దూరమైనట్లు తెలుస్తోంది.


మరోవైపు ఓడిపోయిన దగ్గర నుంచి ధర్మాన ప్రజల మధ్యలోనే ఉంటూ వచ్చారు..పార్టీ నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే కేడర్‌ని సమన్వయం చేసుకుంటూ..పార్టీని బలోపేతం చేశారు. పైగా ఓడిన సానుభూతి...గతంలో మంత్రిగా చేసిన అభివృద్ధి కూడా కలిసొస్తాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే మంత్రిగా ఉన్నప్పుడూ అవినీతి చేశారనే ఆరోపణలు ఉండటం, అప్పుడే రౌడీలకి ఆశ్రయం కల్పించారనే విమర్శలు ఉండటం మైనస్ అయ్యేలా కనిపిస్తోంది.


ఇక ఇక్కడ జనసేన పోటీ నామమాత్రమే అని చెప్పాలి. కాకపోతే  కొంతవరకు ఓట్లు చీల్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆ చీలిక అభ్యర్ధుల గెలుపోటములని తారుమారు చేసే స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి. నియోజకవర్గంలో వెలమ సామాజికవర్గ ఓటర్లే అధికం. ఆ తరువాత కళింగ వైశ్యులు, మత్స్యకారులు గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. మరి చూడాలి ఈ సారి శ్రీకాకుళం లక్ష్మి వశమవుతుందో లేక ధర్మాన దరి చేరుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: