తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో డిఫ్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాధినిత్యం వహిస్తోన్న పెద్దాపురం నియోజకవర్గం ఒకటి. ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన మంత్రుల జాతకాలను పరిశీలిస్తే ఐదారుగురు మంత్రులు మినహా మిగిలిన మంత్రులంద రికి గెలుపు నల్లేరు మీద నడక కాదని స్పష్టం అవుతోంది. చాలా మంది మంత్రులు ఓడిపోతారని పందాలు సైతం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇద్దరు మంత్రులతో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన నాలుగురు మంత్రులు గెలుపు కోసం ఏటికి ఎదురీదుతున్నట్టు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పరిస్థితులు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఉప ముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తున్న పెద్దాపురంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ రాజప్ప బలాబలాలు ఏంటి, ఆయన ప్రత్యర్థుల బలాబలాలు ఏంటన్నది పరిశీలిస్తే చినరాజప్ప గెలుపు కోసం శక్తికి మించి కష్టపడక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. 


23 సంవత్సరాల పాటు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష్యుడిగా పని చేసి, ఎమ్మెల్సీగా పని చేసిన రాజప్ప గత ఎన్నికల్లో తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. పెద్దాపురం నుంచి పోటీ చేసిన రాజప్ప 10,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ నుంచి పోటీ చేసిన తోట సుబ్బారావు నాయుడుపై విజయం సాధించారు. వాస్తవంగా చూస్తే కోనసీమలోని అమలాపురం నియోజకవర్గానికి చెందిన రాజప్ప పెద్దాపురంలో గత ఎన్నికల్లో గెలుస్తాడని ఎవరు ఊహించలేదు. అయితే అనూహ్యంగా జనసేన సపోర్ట్‌ చెయ్యడంతో పాటు జిల్లాల్లో బలంగా వీచిన టీడీపీ వేవ్‌తో రాజప్ప విజయం సాధించి అనూహ్యంగా ఉప ముఖ్య మంత్రి పదవితో పాటు హోమ్‌ మంత్రి పదవి చేపట్టారు. ఐదేళ్ల పాటు రాజప్ప రెండు కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నా నియోజకవర్గంలో ఆయన మాత్రం ముద్ర వెయ్యలేకపోయారు. ఇప్పుడు ఆయనకు వైసీపీ నుంచి బలమైన ప్రత్యర్థి ఉన్నారు. నిన్నటి వరకు టీడీపీ తరపున కాకినాడ ఎంపీగా ఉన్న మాజీ మంత్రి తోట నరసింహం సతీమణి తోట వాణి వైసీపీ తరపున ఇక్కడ పోటీ చేస్తున్నారు.


అంతర్గత కలహాలే రాజప్పకు మైన‌స్‌...
గడచిన ఐదేళ్లలో చూస్తే రాజప్ప కేబినెట్‌ పరంగా రెండో ర్యాంకులో ఉన్నా శాఖలకు మంత్రిగా ఉన్నా తనదైన స్థాయిలో అభివృద్ధి చెయ్యలేకపోయారన్న అపవాథు ఉంది. రాజప్ప అండతో ఇక్కడ అక్రమ మైనింగ్‌ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వెన్నుదండుగా ఉన్న సామాజికవర్గం వారిని ఆయన ఓపెన్‌గానే సూటిపోటి మాటలతో వేధించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదే టైమ్‌లో నియోజకవర్గంలో పట్టున్న సీనియర్‌ నేత బొడ్డు భాస్కర్‌ రామారావు రాజప్ప అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేఖించారు. బొడ్డు వర్గం ఎన్నికల వేళ‌ ఎటు చేస్తుందన్నది సందేహంగా ఉంది.  ఇక నియోజకవర్గానికి రాజప్పతో పాటు అటు తోట వాణి సైతం స్థానికేతురులే అయినా రాజప్ప మరీ దూరంగా కోనసీమకు చెందిన వ్యక్తి కావడం ఓ మైనెస్‌. తోట వాణి పెద్దాపురం పక్కనే ఉన్న జగ్గపేట నియోజకవర్గానికి కోడలు. తోట వాణి దివంగత మాజీ మంత్రి మెట్ట సత్యనారాయణ కుమార్తె కావడంతో ఆమెకు రాజకీయంగా బలమైన నేపథ్యం ఉంది. మరో వైపు మహిళా సెంటిమెంటుతో పాటు మంచి వాయస్‌ ఉండడంతో తోట వాణి కూడా ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోతున్నారు. 


ఆర్థిక బలాబలాలు నేపథ్యంలో రాజప్ప చాలా బలంగా ఉండగా తోట వాణి కనీసం డబ్బుల విషయంలో కార్యకర్తలను సైతం సంతృప్తి పరచలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రచార సమయంలోనే మరీ పిసినారి తనంతో వ్యవహరిస్తుండడంతో రేపు ఎన్నికల వేల ఆమె ఇకేం చేస్తారో అన్న సందేహాలు వైసీపీలోనే ఉన్నాయి. గత ఐదేళ్లలో రాజప్ప మంత్రిగా ఉండడంతో ఆయనకు భారీగా ఆర్థిక వనరులు సమకూరడం ఇప్పుడు ఎన్నికల్లో ఆయన ఈ విషయంలో పైచేయితోనే ఉన్నారు. ఇక జనసేన నుంచి పోటీ చేస్తున్న తుమ్మల రామస్వామి ప్రధానంగా కాపు సామాజికవర్గం ఓట్లతో పాటు పవన్‌ అభిమానులపైనే ఆశలు పెట్టుకున్నారు. 2009లో ఇక్కడ ట్రయాంగిల్‌ ఫైట్‌లో నాడు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన పంతం గాంధీ మోహన్‌ సంచలన విజయం సాధించారు. దీంతో ఇప్పుడు జనసేన సైతం ఏదైనా సంచలనం సాధిస్తుందా అన్న ఆశలు ఆ పార్టీ వర్గాలకు ఉన్నాయి. 


వాస్తవంగా చూస్తే నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ మధ్యే పోటాపోటీ నడుస్తోంది. నియోజకవర్గంలో 45,000 ఓటింగ్‌ ఉన్న కాపు సామాజికవర్గంతో పాటు 25,000 ఓటింగ్‌ ఉన్న కమ్మ సామాజికవర్గం ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. చినరాజప్పకు పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో మంచి పట్టుంది. తోట వాణీకి చివరిలో వైసీపీ సీటు ఖరారు కావడం, ఆమె ఇక్కడ చివరిలో రావడం ఆమె నియోజకవర్గానికి ఎన్నికలు ముందు రావడం, అప్పటి వరకు సీటుపై ఆశలు పెట్టుకున్న ద‌వులూరి దొరబాబు వర్గం అసంతృప్తితో ఉండడం ఆమెకు మైన‌స్‌గా మారింది. ఏదేమైన పెద్దాపురంలో ఇద్దరు స్థానికేతురులు అయిన సిట్టింగ్‌ మంత్రి, మాజీ మంత్రి భార్య మధ్య‌ జరుగుతున్న పోరులో ఎవరు విజయం సాధిస్తారన్నది ప్రస్తుతానికి అంచనాకి దొరక్కపోయినా చినరాజప్పకు ఆవగింజంత మొగ్గు ఉందన్నది వాస్తవం. అయితే ఇది ఎన్నికల వేళ‌ ఎలా మారుతుందో చెప్పలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: