కృష్ణా జిల్లాలో హాట్ ఫైట్ జరిగే స్థానాల్లో గుడివాడ ముందు వరుసలో ఉంటుంది. గత మూడు పర్యాయాలుగా గుడివాడని తన అడ్డాగా మార్చుకుని హ్యాట్రిక్ విజయాలు సాధించిన కొడాలి వెంకటేశ్వరరావు(నాని) మరోసారి వైసీపీ నుంచి బరిలో దిగుతుండగా....నానికి ఈ సారి ఎలా అయిన చెక్ పెట్టి...తమ కంచుకోటని సొంతం చేసుకోవాలని టీడీపీ....దేవినేని అవినాష్‌ని రంగంలోకి దించింది. ఇక ఇక్కడ జనసేన అభ్యర్ధి నామినేషన్ రిజెక్ట్ అవ్వడంతో....టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇప్పటికే పోటిపోటిగా ప్రచారం చేస్తున్న ఇద్దరు నేతలు...ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గుడివాడ రాజకీయాన్ని వేడెక్కించారు.


ఇక రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా, ఒకసారి వైసీపీ ఎమ్మెల్యేగా కొడాలి నాని...గుడివాడలో కొంతవరకు అభివృద్ధి మాత్రమే చేయగలిగారు. ఎందుకంటే నాని గెలిచిన ప్రతిసారి...ఆయా పార్టీలు అధికారంలోకి రాలేదు. అయితే అభివృద్ధి అనుకున్నంత జరగకబోయినా నాని మాత్రం ప్రజలతోనే ఉన్నారు. ఏ కులం అయినా..ఏ మతం అయినా...నానికి అందరితో కలిసిపోయే గుణం ఉంది.. అందుకే ఆయనకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా గుడివాడలో ఎప్పటి నుంచో టీడీపీకి మద్ధతుగా ఉన్న కొన్ని గ్రామాలని తన వైపు తిప్పుకుని ముందుకు వెళుతున్నారు. కానీ దురుసుగా మాట్లాడటం, ఏ స్థాయి వ్యక్తులనైనా బూతులు తిట్టడం వలన నానిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది.


అటు స్థానికంగా ఉన్న సీనియర్ నేతలనీ కాదని టికెట్ తెచ్చుకున్న అవినాష్ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సీనియర్ నేతల సూచనలతో  వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇక టీడీపీకి ఉన్న కేడర్ అతి పెద్ద బలం. పైగా టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. అలాగే అవినాష్ నియోజకవర్గానికి వచ్చాక...చాలాకాలం నుంచి నానికి అండగా ఉంటున్న కొన్ని గ్రామాలని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఆర్ధికంగా కూడా అవినాష్ బలంగానే ఉన్నాడు. అయితే ఎంత గుడివాడలో ఇల్లు తీసుకున్న నాన్ లోకల్ అనే ఫీలింగ్ ప్రజల్లో ఉంది.
ఇక నియోజకవర్గంలో గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ అర్బన్, రూరల్ మండలాలు ఉన్నాయి.

గుడివాడ రూరల్‌పై నానికి పట్టుంది. గుడ్లవల్లేరులో టీడీపీ కేడర్ బలంగా ఉంది. కాకపోతే అర్బన్, నందివాడ మండలాల్లో నానికి మంచి ప‌ట్టు ఉంది. సామాజికవర్గాల పరంగా చూసుకుంటే ..ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. తర్వాత బీసీలు, కాపులు ఉంటారు. కమ్మ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. బీసీలలో రెండు పార్టీలకి మద్ధతు ఇచ్చేవారు ఉన్నారు. ఎస్సీలు వైసీపీ వైపు ఎక్కువ ఉండొచ్చు. కమ్మ టీడీపీకే సపోర్ట్. అయితే క‌మ్మ‌ల్లో మెజార్టీ వ‌ర్గం ఏపీలో ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా స‌హ‌జంగానే టీడీపీ వైపు ఉంటాయి. అయితే గుడివాడ‌లో ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఉంది.


జనసేన పోటీలో ఉంటే కాపులు అటువైపే ఎక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు వారు నానికి ఎక్కువ మద్ధతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అవినాష్‌కు టీడీపీలో సీటు ఆశించిన సీనియ‌ర్లు ప్ర‌స్తుతానికి స‌పోర్ట్ చేస్తున్నా వీరిలో కొంద‌రు ఎన్నిక‌ల వేళ ప్ర‌త్య‌ర్థికి అమ్ముడు పోతార‌నే ప్ర‌చారం కూడా ఉంది. గ‌తంలో ఇలాంటి సంద‌ర్భాల‌ను సైతం గుడివాడ ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఏదేమైనా గుడివాడ‌లో నానిని ఓడించేందుకు అవినాష్ మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి ఉంద‌ని అక్క‌డ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం చెపుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: