ఎన్నికలు వస్తున్నాయి.. ఓటు ఎవరికి వేయాలో ఓటరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎన్నికల సమయంలో నేతలు డబ్బు పంచడం సాధారణంగా మారింది. కానీ ఓటు వేసే ముందు.. ఓటరు తీవ్రంగా ఆలోచించకపోతే.. ఏపీని బాగుచేసేవాడు ఎవరూ ఉండరని సీనియర్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరిస్తున్నారు. 


ఎన్నికల్లో విజయం కోసం 20 కోట్లు ఖర్చు చేసేవాడు తప్పకుండా ముందు ఆ సొమ్ము రికవరీ చేసుకునేందుకు ప్రయత్నించడం అత్యంత సహజం అన్నారు. అంతే కాదు.. ఆ 20 కోట్లతో ఆగకుండా.. మరింత  దోపిడీకి అలవాటు పడతాడని ఉండవల్లి చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ ఐదేళ్లలో దాదాపు ఆరు లక్షల కోట్లు ఉంటోందని.. ఒక్కో మనిషికి రోజుకు ఐదువందల రూపాయలు అవుతుందన్నారు. 

కానీ మనం ఓటుకు రెండు వేలు తీసుకుంటే.. ఐదేళ్లలో రోజుకో రూపాయి వస్తుందని..అంటే మనం 500 విలువైన ఓటును ఒక్క రూపాయికి అమ్ముకుంటున్నామని లెక్కలు వేసి వివరించారు. అందుకే ఎన్నికల్లో డబ్బు ఇచ్చేవాడెవరైనా సరే వాడికి ఓటు వేయవద్దని పిలుపు ఇచ్చారు ఉండవల్లి.  

ఒకవేళ అన్ని పార్టీల వాళ్లూ డబ్బులిస్తే.. అప్పుడు ధైర్యంగా వెళ్లి నోటాకు ఓటేసి రావాలని ఉండవల్లి పిలుపు ఇచ్చారు. నోటాకు ఓటేస్తే మురిగిపోతుందనుకోవడం కరెక్టు కాదని.. అవినీతి నాయకులను ఎన్నుకోవడం కంటే నోటాకు వేయడమే కరెక్టని ఉండవల్లి సూచించారు. నిజంగా ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఈ ఉండవల్లి ప్రసంగం వింటే  ఏపీ బాగుపడుతుందనడంలో అతిశయోక్తి లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: