గుంటూరు జిల్లాలో పలు కీలక నియోజకవర్గాల్లో అధికార, విపక్ష పార్టీ అభ్యర్థులకు గెలుపు చాలా ప్రతిష్ఠాత్మంగా మారింది. అధికార తెలుగుదేశం పార్టీలో రెండు దశాబ్దాలు, అంతకు మించి రాజకీయాలు చేస్తున్న సీనియర్లు చాలా మందే ఉన్నారు. జీవీ. ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్‌ రావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ వీళ్లందరూ టీడీపీలో సుధీర్ఘ‌మైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులే. వీళ్లందరికి వచ్చే ఎన్నికల్లో గెలుపు అత్యంత ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇలాంటి హాట్‌ హాట్‌ నియోజకవర్గాల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాధినిత్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం కూడా ఒకటి. 1999 నుంచి ప్రతీ ఎన్నికల్లో చిలకలూరిపేటలో టీడీపీ తరపున పోటీ చేస్తు మూడు సార్లు గెలిచిన ఆయన తాజా ఎన్నికతో కలుపుకుంటే ఐదో సారి పోటీకి రెడీ అవుతున్నారు. గత మూడు ఎన్నికల్లోనూ పుల్లారావుతో కాంగ్రెస్‌, వైసీపీ నుంచి ముఖాముఖి తలపడ్డ సీనియర్‌ నేత మర్రి రాజశేఖర్‌ తప్పుకోవడంతో ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎన్నారై మహిళ విడదల రజినీ రంగంలో ఉన్నారు. 


తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మంత్రి పుల్లారావు శిష్యురాలుగా ఎదిగిన ఆమె చివరకు పుల్లారావుపైనే పోటీ చేస్తు సవాళ్లు రువ్వుతున్నారు. నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా తిరుగులేని నేతగా అధికారం చెలాయిస్తున్న పుల్లారావు 2004లో మాత్రమే ఓడిపోయారు. అది కూడా ఆ ఎన్నికల్లో ఆయన కేవలం 200 ఓట్ల స్వల్ప తేడాతో మాత్రమే ఓడారు. ఇప్పటి వరకు రాజకీయంగా తనతో సమవుజ్జీలు, సీనియర్లతో పోటీ పడిన పుల్లారావు ఈ ఎన్నికల్లో తన శిష్యురాలుపైనే పోటీ చెయ్యడం కొత్త తర‌హా ప‌రిస్థితే. టీడీపీలో రాజకీయంగా ఎదిగి పుల్లారావును విభేదించి చివరకు అదే పుల్లారావుపై పోటీ చేస్తున్న రజినీ గత ఏడెనిమిది నెలలుగా దూకుడు రాజకీయాలతో ముందుకు వెళ్లారు. పుల్లారావును ఎట్టి పరిస్థితుల్లో అయినా ఓడిస్తానని మరీ సవాళ్లు రువ్వారు. పుల్లారావు విషయానికి వస్తే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఐదేళ్లలో మంత్రిగా నియోజకవర్గాన్ని రూ. 3000 కోట్లతో అభివృద్ధి చేసాశాన్న నినాదంతో ముందుకు వెళ్తున్నారు. తన కన్నా రాజకీయంగా చాలా జూనియర్‌ ఇంకా చెప్పాలంటే తన శిష్యురాలు తనపై సవాళ్లు రువ్వుతుండడంతో ఈ ఎన్నికల్లో పుల్లారావు మంత్రి హోదాతో రంగంలో ఉండి గెలుపు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 


ఈ క్రమంలోనే అటు రజినీ సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రిని ఓడించి చిలకలూరిపేట రాజకీయాల్లోనే కాకుండా తెలుగు రాజకీయాల్లో ట్రెండ్‌ సెట్‌ చెయ్యాలని తీవ్రమైన పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే అటు పుల్లారావు ఇటు రజినీ ఇద్దరూ కూడా విజయం సాధించేందుకు ఆర్థికంగా ఏ మాత్రం వెనుకడుగు వేసే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు 30 నుంచి ప్రారంభించి 60 నుంచి 70 కోట్లు వరకు ఖర్చు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఓ అభ్యర్థి 60 నుంచి 70 కోట్లు అయినా ఖర్చు చేసేందుకు వెనుకాడకపోవడంతో తన కెరియర్‌కు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మరో అభ్యర్థి 80 నుంచి 100 కోట్లు పెట్టేందుకు అయినా ఏ మాత్రం వెనుకాడడం లేదని తెలుస్తోంది.

దీనిని బట్టీ చూస్తే ఓవర్‌ ఆల్‌గా చిలకలూరిపేట రాజకీయాల్లో ఒక్కరి గెలుపు కోసం మొత్తంగా రూ. 150 కోట్లు వరకు ఖర్చు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పేట రాజకీయాల్లో ఇదే అంశం బాగా హాట్‌ టాపిక్‌గా మారింది. 150 కోట్ల రూపాయిల ఈ ధనస్వామ్యంలో ఎవరు విన్నర్‌గా నిలుస్తారు ? మంత్రి తన ప్రతిష్ఠను నిలుపుకుంటారా లేదా రజినీ సంచలనం సృష్టిస్తుందా ? అన్నది తుది ఫలితాల వరకు వేయిట్‌ చెయ్యాల్సిందే. ఏదేమైన ఈ సీనియర్‌ మంత్రి వర్సెస్‌ జూనియర్‌ మహిళా నేత మధ్య‌ పేట వేదికగా ఆసక్తికర యుద్ధం జరుగుతుందన్నది మాత్రం వాస్తవం.



మరింత సమాచారం తెలుసుకోండి: