తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ఈసారి అదిరిపోయే ఫైట్ జరగనుంది. గత ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన నేతలే మళ్ళీ పోటీలో ఉన్నారు. కానీ ఈ సారి పార్టీలు మారాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన జ్యోతుల నెహ్రూ..టీడీపీ నుంచి బరిలో ఉండగా....అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జ్యోతుల చంటిబాబు ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే నెహ్రూ-చంటిబాబులు బాబాయ్-అబ్బాయ్‌లు అవుతారు. ఇక జనసేన నుంచి పాటంశెట్టి సూర్యచంద్రరావు బరిలో ఉన్నారు. కాకినాడ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో మెట్ట ప్రాంతంలో ఉన్న జ‌గ్గంపేటలో కాపులు రాజ‌కీయ ఆధిప‌త్యం చెలాయిస్తూ వ‌స్తున్నారు.


టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నెహ్రూకి నియోజకవర్గంపై మంచి పట్టుంది. టీడీపీలో చేరాక నియోజకవర్గంలో అభివృద్ధి బాగా చేశారు. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఎన్టీఆర్ ఇళ్ళు, గ్రామాల్లో సి‌సి రోడ్లు, మెరుగైన త్రాగునీటి సరఫరా వంటి అంశాలతో నెహ్రకి ప్రజల్లో మంచి మార్కులే పడ్డాయి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నెహ్రూకి ప్లస్ కానున్నాయి. అయితే నియోజకవర్గంపై కొంత పట్టున్న తోట నరసింహం ఫ్యామిలీ వైసీపీలో చేరడం కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మరోవైపు రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి పవనాలు వైసీపీ అభ్యర్ధి చంటిబాబుకి కలిసిరానున్నాయి. అలాగే తోట కుటుంబం అండదండలు చంటిబాబుకి గట్టిగానే ఉన్నాయి. కానీ నెహ్రూకి ఉన్న ఇమేజ్ చంటిబాబుకి లేదనే చెప్పాలి. పైగా ఇక్కడ జనసేన కూడా బలంగానే ఉంది.


2004లో టీడీపీ నుంచి, 2009లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ రెండుసార్లూ తోట న‌ర‌సింహం చేతుల్లో ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎట్ట‌కేల‌కు 1999 త‌ర్వాత విజ‌యం సాధించారు. ఇక టీడీపీలో పాత కాపే కావ‌డంతో అటు తిరిగి...ఇటు తిరిగి టీడీపీ గూటికి చేరిపోయారు. జనసేన నుంచి పోటీ చేస్తున్న పాటంశెట్టి సూర్యచంద్రరావు.. సర్పంచ్‌గా దేశవ్యాప్త పేరు సంపాదించిన వ్యక్తి. అలాగే ఇక్కడ కాపులు, పవన్ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.

అయితే అసలు పోరు టీడీపీ-వైసీపీల మధ్యే ఉండటం వలన...జనసేనకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి.  ఇక ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ...అలాగే పోటీ చేసే అభ్యర్ధులు అందరూ ఆ సామాజికవర్గం వారే. దీంతో కాపులు ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్న బీసీ, ఎస్సీలు గెలుపుని కొంత  ప్రభావితం చేయొచ్చు. మొత్తం మీద మూడు పార్టీల మధ్య అదిరిపోయే ఫైట్ జరగనుంది. కాకపోతే గెలుపు అవకాశాలు టీడీపీ-వైసీపీ అభ్యర్ధులకే ఎక్కువ. వీరిలో ఎవరు గెలిచిన అతి తక్కువ మెజారిటీతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి బాబాయ్-అబ్బాయ్‌లలో ఈ సారి జగ్గంపేటని ఎవరు దక్కించుకుంటారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: