కొడుకు సీటు కోసం ఎన్నో ఎత్తులు పైఎత్తులు,  లెక్క‌లేన‌న్ని యుక్తులు పన్ని ఎట్టకేలకు సీటు వచ్చేలా చేసిన ఆ టీడీపీ సీనియర్‌ నేత అనుభవం ఎన్నికల్లో తేడా కొట్టేసింది. కర్నూలు జిల్లాలో సీనియర్‌ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు టి.జి వెంకటేష్‌ ఈ సారి కర్నూలు బరిలో తన కుమారుడు టి.జి భరత్‌ను టీడీపీ నుంచి రంగంలోకి దింపారు. కుమారుడు సీటు కోసం అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్సీ మోహన్‌ రెడ్డిని తప్పించి మరీ భరత్‌కు సీటు వచ్చేలా చెయ్యడంలో వెంకటేష్‌ సక్సెస్‌ అయ్యారు. దాదాపు ఏడాది కాలంగా కర్నూలు టీడీపీ సీటు కోసం వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్‌ చేసిన ఎస్వీ. మోహన్‌ రెడ్డి వర్సెస్‌ టి.జి మధ్య‌ పెద్ద యుద్ధమే నడిచింది. ఇక వైసీపీ నుంచి ఇక్కడ మహ్మద్‌ హఫీజ్‌ఖాన్‌  బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వెంకటేష్‌ ఎస్వీ. మోహన్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మోహన్‌ రెడ్డి టీడీపీలోకి రావడంతో వీరిద్దరి మధ్య‌ రెండేళ్ల పాటు నియోజకవర్గంపై పట్టు కోసం ప్రతి రోజు యుద్ధమే నడిచింది. 


ఎస్వీ. మోహన్‌ రెడ్డి పార్టీ మారిపోవడంతో వైసీపీ హఫీజ్‌ఖాన్‌కు టిక్కెట్‌ ఖరారు చేసింది. చివరకు చంద్రబాబు సైతం టి.జి ఒత్తిడికి తలొగ్గి ఆయన కుమారుడు భరత్‌కే సీటు ఇవ్వడంతో అప్పటి వరకు టీడీపీలో ఉన్న మోహన్‌ రెడ్డి టీడీపీకి షాక్‌ ఇచ్చి వైసీపీలోకి జంప్‌ చేసేశారు. లోకేశ్ సైతం మోహ‌న్‌రెడ్డికే సీటు అని క‌ర్నూలు పర్య‌ట‌న‌లో చెప్పినా పాపం ఆ మాట కూడా ద‌క్క‌లేదు. తనకు సీటు రాకుండా చేసిన టి.జి భరత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరుతానని ఎస్వీ. మోహన్‌ రెడ్డి పగతో ప్రచారం చేస్తున్నారు. టి.జి. వెంకటేష్‌ ఆర్థికంగా బలమైన నేతగా ఉన్నా అటు వైసీపీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్‌కు సైతం ఆర్థికంగా అదే స్థాయిలో అండదండలు ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓటర్లు హఫీజ్‌ఖాన్‌కు వన్‌ సైడ్‌గా మద్దతు ఇస్తున్నారు. దీనికి తోడు రెడ్డి సామాజికవర్గం ఓటర్లు సైతం వైసీపీకి వెన్నుద‌న్నుగా ఉండడంతో హఫీజ్‌ గెలుపు పెద్ద కష్టమేమి కాదు. మైనార్టి ఓట్లు తమ నుంచి దూరం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు టి.జి. భరత్‌ ఆపశోపాలు పడుతున్న పరిస్థితి. 


వైసీపీకి బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం ఓట్లు, మైనార్టీ ఓటర్లు, ఎస్సీ ఎస్టీ ఓటర్లతో హఫీజ్‌ఖాన్‌ దూసుకుపోతుంటే ఇటు టి.జి కుమారుడు టి.జి. భరత్‌  సీటు దక్కించుకోవడానికే నానా కష్టాలు పడినా ప్రచారంలో సైతం అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు తనకు సీటు రాకుండా చేసిన టి.జి. భరత్‌ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న ఎస్వీ. మోహన్‌ రెడ్డి సర్వ శక్తులు వడ్డుతున్నారు. ఇక 1999, 2004 ఎన్నికల్లో ఇక్కడ సీపీఎం సీటు సాధించింది. దీంతో జనసేన కూట‌మి పొత్తులో భాగంగా సీపీఎం అభ్యర్థిని రంగంలోకి దింపింది. జనసేన అభ్యర్థి కాపు సామాజికవర్గ ఓట్లతో పాటు కమ్యూనిస్టుల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు వర్గాల ఓట్లు చీలితే అది కూడా టీడీపీకే ఎఫెక్ట్‌ కానుంది. జనసేన ఇక్కడ పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే నడుస్తోంది. అదే టైమ్‌లో టి.జి భరత్‌ సమీకరణలు కలిసిరాక ప్రచారంలోనే ఏటికి ఎదురీదుతున్నారు. మ‌రి మోహ‌న్‌రెడ్డి ప‌గ భ‌ర‌త్‌ను ఓడిస్తుందో ?  లేదో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: