ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అత్యంత హోరా హోరీగా సాగిన ప్రచార పర్వంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ కూడా అదే రేంజ్‌లో కొనసాగింది. ఇక, పోలింగ్‌ సరళి సైతం రెండు పార్టీలకూ ధీమాను పెంచింది. పోటెత్తిన మహిళా ఓటింగ్‌ ప్రభుత్వ వ్యతిరేకతను చిహ్నమని వైసీపీ అంటే.. కాదు.. మేం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు చిహ్నమని టీడీపీ పేర్కొంటోంది. ఏదేమైనా ప్రజల తీర్పు ఈవీఎం పెట్టెల్లోకి చేరిపోయింది. మే 23న కానీ ఫలితం నోరు విప్పదు. అయితే, పోలింగ్‌ సరళిని గమనిస్తే.. నందమూరి, నారా కుటుంబాల నుంచి బరిలో నిలిచిన నాయకుల పరిస్థితి ఇలా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. నందమూరి కుటుంబం నుంచి బాలయ్య, ఆయన ఇద్దరు అల్లుళ్లు మంత్రి నారా లోకేష్‌, మెతుకుమిల్లి శ్రీభరత్‌లు పోటీకి దిగారు. ఇక, సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. 


నందమూరి బాలయ్య అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండో సారి పోటీ చేస్తున్నారు. తనదైన శైలిలో ఇక్కడ అభివృద్ధి చేశానని చెప్పుకొంటున్నా.. తన పుట్టిన ఊరుకన్నా ఇదే తనకు ఎక్కువని సెంటిమెంటును పారించినా.. అదేసమయంలో అంతే స్థాయిలో ఆయన వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. చేతివాటం ఎక్కువగా ప్రదర్శించి యువతకు దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది. ఇక, వైసీపీ తరఫున నవీన్‌ నిశ్చల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాలయ్య ఓటమి ఖాయమయ్యేదని అంటున్నారు. అయితే, ఇక్కడ ఇద్దరు మైనార్టీ అభ్యర్థులను మార్చడం, నవీన్‌ చివరి నిముషంలో తప్పించడం వంటివి మాత్రమే బాలయ్యకు కొంతమేరకు ఆశలు పుట్టిస్తున్నాయి. అయినా కూడా గెలుపు పై సందేహం కొనసాగుతోంది. గెలిచినా బాల‌య్య అత్తెస‌రు మెజార్టీతోనే గ‌ట్టెక్కాల్సిందే.


ఇక, చంద్రబాబు విషయానికి వస్తే వరుసగా ఐదు సార్లుగా ఆయన కుప్పం నుంచి గెలుస్తున్నారు. దీంతో ఒకింత ఆయనకు వ్యతిరేకత ఉన్నా.. కూడా గెలుపు ఖాయమనే వాదన వినిపిస్తోంది. అయితే గ‌తంలోలా ఆయ‌న మెజార్టీ ఉండేలా లేదు. కుప్పంలో వైసీపీ బీసీ అభ్య‌ర్థి అయిన చంద్ర‌మౌళిని ప్ర‌క‌టించ‌డం... ప్ర‌జ‌ల్లో కాస్త ఆలోచ‌న రావ‌డంతో బాబు మెజార్టీ భారీగా ప‌డిపోనుంది. మరోపక్క, రాజధాని జిల్లా గుంటూరులోని మంగళగిరి నుంచి బరిలో నిలిచిన మంత్రి నారా లోకేష్‌ గెలుపు ఓటములపై అంచనాలు దోబూచులాడుతున్నాయి. చేనేత వర్గానికి టికెట్‌ ఇవ్వకపోవడం.,. బలమైన నాయకులు వైసీపీకి అండగా నిలవడం వంటివి ఆయనకు ఇబ్బంది కరంగా మారాయి. అయినా టఫ్‌ ఫైట్‌ మాత్రం కొనసాగుతోంది. గెలుపుపై మాత్రం ధీమా కనిపించడం లేదు. వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి సైతం గెలుపుపై తిరుగులేని ధీమాతో ఉన్నారు.


ఇక, నాలుగో వ్యక్తి విశాఖ నుంచి ఎంపీగగా పోటీ చేసిన మెతుకుమిల్లి శ్రీభరత్‌. ఈయన బాలయ్య రెండో అల్లుడు అనే ఒకే ఒకట్యాగ్‌ పనిచేసింది. అయితే, జనసేన తరఫున బలమైన నాయకుడిగా జేడీ లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి పోటీ ఇస్తుండడం టీడీపీ ఓటు చీలి జనసేనకు ప్లస్‌ కావడం వంటివి ఆయనను ఓటమి అంచుకు చేర్చాయి. ఇక్క‌డ పురందేశ్వ‌రి బ‌రిలో ఉండ‌డం, వైసీపీ నుంచి కూడా అన్నివిధాలా బ‌ల‌మైన అభ్య‌ర్థి ఎంవీవీ.స‌త్య‌నారాయ‌ణ రేసులో ఉండ‌డం భ‌ర‌త్‌కు దెబ్బేశాయి. మొత్తంగా నారా, నందమూరి ఫ్యామిలీ నుంచి పోలింగ్‌ సరళిని అంచనా వేస్తే.. చంద్రబాబు ఒక్కరే విజయం సాధించ‌గా... మిగిలిన వారి గెలుపుపై అంత ధీమా అయితే ఎవ్వ‌రిలోనూ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: