ఈ సారి ఏపీలో జరిగిన ఎన్నికలు చాలా మంది సీనియర్లకు చివరి ఎన్నికలు కానున్నాయి. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కంటిన్యూగా కొనసాగుతూ వస్తున్న సీనియర్‌ సిటిజన్లు ఈ సారి చివరిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికలే ఈ రాజకీయ భీష్ములకు చివరి ఎన్నికలు. వీరు ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. మూడు జిల్లాల్లో దాదాపు డజనకు పైగా ఈ రాజకీయ సీనియర్‌ సిటిజన్లు ఉన్నారు. వీరు అన్ని పార్టీల్లోనూ ఉన్నా టీడీపీలో ఎక్కువగా ఉండడం విశేషం. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా నుంచి మాజీ కేంద్ర మంత్రి, విజయనగరం టీడీపీ అభ్యర్థిగా ఉన్న పూసపాటి అశోక్‌ గజపతి రాజుకు ఇవే చివరి ఎన్నికలు. 1978 నుంచి వరుసగా ప్రతీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తు వస్తున్న ఆయన గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పట్టు పట్టి మరీ తన కుమార్తె అతిథిని విజయనగరం నుంచి అసెంబ్లీ రంగంలోకి దింపారు. 


అసలు అశోక్‌ ఈ ఎన్నికల్లోనూ తప్పుకుంటారని అనుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎంపీగా పంపి, ఆయన కోరిక మేరకు ఆయన కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ఇచ్చారు. అదే జిల్లాలో రాజకీయ కురువృద్ధుడుగా పేరుగాంచిన నెల్లిమ‌ర్ల టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామి నాయుడుకు గెలిచినా ఓడినా ఇవే రాజకీయంగా చివరి ఎన్నికలు. వాస్తవంగా ఈ ఎన్నికల్లోనే ఆయన తప్పుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో నెల్లిమర్లలో నారాయణ స్వామి నాయుడు అయితేనే బలమైన అభ్యర్థి అవుతారని చంద్రబాబు ఆయన్ను చివరిగా రంగంలోకి దింపారు. ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌కు కూడా ఇవే చివరి ఎన్నికలు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన గతంలో రద్దు అయిన పార్వతీపురం, ఆ తర్వాత అరకు నుంచి ఎంపీగా పలు సార్లు విజయాలు సాధించారు. 


2014లో అరకు నుంచి గెలిచిన ఆయన కేంద్రంలో మంత్రి కూడా పని చేశారు. గత ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్‌లో ఉన్న కిషోర్‌ అనూహ్యంగా చివరిలో టీడీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి ఎంపీ రేసులో ఉన్నారు. వయస్సు రీత్యా ఇప్పటికే పెద్ద వాడిగా ఉన్న ఆయనకు ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ఇక విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చివరి సారి అంటూనే మళ్లీ పోటీలోకి దిగారు. ఇప్పటికే ఆయన వయస్సు 70 ఏళ్లకు చేరువ అవుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఆయన రాజకీయాలకు సెలవు చెప్పేయనున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఆయన తప్పుకుని ఆయన కుమారుడు విజయ్‌ను నర్సీపట్నం నుంచి అసెంబ్లీ లేదా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు మాత్రం పట్టుబట్టీ మళ్లీ ఆయ్యన్నకే సీటు ఇచ్చారు. 


ఇక టీడీపీకి చెందిన మరో సీనియర్‌ నేత, పెందుర్తి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తికి కూడా ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ఇక మూడు దశాబ్దాల చరిత్ర ఉండి గతంలో విశాఖ మేయర్‌, అనకాపల్లి ఎంపీగా పని చేసిన సబ్బం హరికి కూడా ఇవే చివరి ఎన్నికలు. ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్‌ చేసి భీమిలి నుంచి పోటీలో ఉన్న ఆయన గెలిచినా, ఓడినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. విశాఖ నార్త్‌ నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు గెలిస్తే ఓకే.. పొరపాటున ఓడితే మాత్రం ఆయన కూడా రాజకీయంగా తప్పుకోవడమే అని సన్నిహితుల వద్ద అన్నట్టు తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు సైతం గెలిచినా, ఓడినా తనకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఇప్పటికే గత కేబినెట్‌లో మంత్రులుగా పని చేసిన కేఈ. కృష్ణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, పరిటాల సునీత, కిమిడి మృణాలిని లాంటి వాళ్లు తప్పుకుని వారసులకు అవకాశం ఇచ్చారు. 


అలాగే పెడన నుంచి వరసగా గెలుస్తున్న సీనియర్‌ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సైతం తప్పుకుని తన వారసుడిని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. అలాగే సత్తెనపల్లి నుంచి రేసులో ఉన్న స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుకు సైతం ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ఏదేమైన మూడు నాలుగు దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తున్న ఈ సీనియర్‌ నేతల కెరియర్‌ ఈ ఎన్నికలతో పరిసమాప్తి కానుంది. వీరిలో గెలిచి వాళ్లు మరో ఐదేళ్లు అధికారంలో ఉంటారు, ఓడిన వారి కథ అంతటితోనే ఆగిపోనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: