రాజ‌కీయాల‌కు సినిమా ఇండ‌స్ట్రీకి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అనేక మంది హీరోలు, హీరోయిన్లు రాజ‌కీయాల్లో త‌ల‌మున‌క‌లైన సంద‌ర్భాలు అనేకం మ‌నం చూస్తున్నాం. సీఎంలు అయిన‌వారు, మం త్రులుగా చ‌క్రాలు తిప్పిన‌వారు ఉన్నారు.. ఇక‌, ఇప్పుడున్న ట్రెండ్‌లో అయితే, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు, క‌మెడియ‌న్లు కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వ‌స్తున్నారు. త‌మ‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే, ఎవ‌రు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. ఒక పార్టీకి స‌పోర్టు చేయ‌డం మ‌న‌కు తెలిసిందే. లేదంటే పార్టీలు మారిన న‌టుల గురించి కూడా మ‌న‌కు తెలుసు. కానీ, ఇటీవ‌ల ఓ యువ హీరో మాత్రం .. ఒక‌టి కాదు .. రెండు కాదు ఏకంగా మూడు పార్టీల‌కు ఏక కాలంలో స‌పోర్టు చేయ‌డం వింత‌గా అనిపిస్తోంది.


విష‌యంలోకి వెళ్తే.,. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ తాజా ఎన్నిక‌ల్లో మూడు పార్టీల‌కు స‌పోర్టు చేయ‌డం ఆయ‌న వ్యూహాన్ని తెలియ‌జేస్తోంది. ముందుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశాడు. కర్నూలు జిల్లా కు వెళ్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ కుమారుడు కేఈ ప్రతాప్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. కేఈ ప్రతాప్ తనకు అంకుల్ అని అందుకే ఆయన తరఫున వెళ్లి ప్రచారం చేసినట్టుగా చెప్పుకొచ్చాడు.  దీంతో అంద‌రూ ఆయ‌న టీడీపీ నేత‌గా భావించారు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యాడో.. లేక త‌న‌ను ఒకే పార్టీకి అంట‌గ‌ట్టేస్తున్నార‌ని ఫీల‌య్యాడో ఏమో నిఖిల్ వెంట‌నే ప్లేట్ ఫిరాయించాడు. 

Image result for tollywood hero nikhil

తన సపోర్ట్ జనసేనకు ఉందన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఈ క్ర‌మంలోనే  జనసేన తరఫున విశాఖ నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను కలిసి ఈయన మద్దతు ప్రకటించాడు. ఎన్నడూ లేని రీతిలో లక్ష్మినారాయణ కొత్త రాజకీయం చేస్తున్నారని బాండ్ పేపర్ల మీద హామీలను రాసిస్తూ ఉన్నాడని జనసేన తరఫున చాలా సాధారణ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కూడా పోటీలో ఉన్నారని.. అది చాలా గొప్ప విషయం అని నిఖిల్ ప్ర‌చారం చేసుకొచ్చాడు. అయితే, నిఖిల్ ఇక్క‌డితో ఆగి ఉంటే.. స‌రేలే.. జ‌న‌సేన‌కు టీడీపీకి మ‌ధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో రెండు పార్టీల‌కు ప్ర‌చారం చేశాడ‌ని స‌రిపెట్టుకొనే వారు. 


కానీ, ఈ హీరో రాజకీయం అంతటితో కూడా ఆగలేదు. మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి కూడా ఈయన విషెస్ చెప్పాడు. సికింద్రాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీలో ఉన్న తలసాని సాయి యాదవ్ కు ఈయన మద్దతు ప్రకటించాడు. తలసాని సాయి యాదవ్ తనకు స్నేహితుడు అని ఫ్యామిలీ ఫ్రెండ్ అని .. ఆయన రాజకీయ ప్రయాణానికి శుభాకాంక్షలు అని నిఖిల్ మరో పోస్టు పెట్టాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఆ ఫొటోలో ఉన్నాడు. ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన తెలంగాణ రాష్ట్ర సమితి.. మూడు పార్టీల అభ్యర్థులను ఈయన కలిశాడు. తను కలిసి వాళ్లందరితోనూ తనకు ఏదో ఒక బాంధవ్యం ఉందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి పిట్ట కొంచెమే అయినా.. రాజ‌కీయంగా కూత మాత్రం ఘ‌నంగా పెట్టాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: