ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టీడీపీకి ముందు 120 సీట్లు ఖాయమని చంద్రబాబు.. ఆ తర్వాత ఆ సీట్ల సంఖ్య పెంచుకుంటూ పోయారు. చివరకు 150 సీట్లు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదన్నారు. 


అటు జగన్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ ఇద్దరికీ భిన్నంగా పవన్ కల్యాణ్ మాత్రం తన అంచనాలు ప్రకటించలేదు. ఆయన నిశబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈవీఎంలలో ఓట్లు నిక్షిప్తమైన సమయంలో టీడీపీ, వైసీపీల తరహాలో ఎంత మాట్లాడినా ఉపయోగం ఉండదన్న సంగతి తెలిసిందే. 

అంతే కాదు.. పవన్ కల్యాణ్ జనసేన భవిష్యత్ వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ప్రజారాజ్యం పార్టీలాగా జనసేన జెండా ఎత్తేయబోదన్న భరోసా కల్పించేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ నేతలతో ఆయన సమావేశమైన సమయంలోనూ నేతలకు ఇదే భరోసా ఇచ్చారు. 

ఇప్పుడే ఆట మొదలైంది అని చెప్పడం ద్వారా సుదీర్ఘ పోరాటానికి తాను సిద్ధమైనట్టు చెప్పకనే చెప్పారు. ఏపీ రాజకీయాలు టీడీపీ, వైసీపీ మధ్య కబడ్డీ ఆటగా మారిన నేపథ్యంలో జనసేన యాక్టివ్ పార్ట్ తీసుకోవడం ఏపీకి ప్రయోజనమే అంటున్నారు విశ్లేషకులు. మరి పవన్ కల్యాణ్ ఫ్యూచర్ ప్లాన్‌ ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: