తెలంగాణ ఉద్యమంలో కీలక నినాదాలు.. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు.. ఇందులో మొదటిది నీళ్లు.. వీటి కోసం భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఉద్యమంగా నిర్మాణం సాగిస్తున్న కేసీఆర్.. అందులో మొదటి అడుగు విజయవంతంగా పూర్తి చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతమైంది. 


130 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం విశేషం. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్,  ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని కేసీఆర్ అంటున్నారు.  

తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మెదడును కరిగించాం. అనేక రకాల ఆలోచించాం. ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మరో గత్యంతరం లేదని తీర్మానించుకున్నాం. 

కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశాం. రక్షణ శాఖ అనుమతి తీసుకుని మరీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లైడార్ సర్వే నిర్వహించి, పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. గోదావరి నుంచి నీటిని తోడడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 139 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్ చేశాము. 

గతంలో తెలంగాణలో 80 నుంచి 85 మీటర్ల వరకు మాత్రమే ఎత్తిపోసిన అనుభవం ఉంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కోపంపు గరిష్టంగా 120 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్ చేసే ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడానికి ఇంజనీర్లు, అధికారులు విదేశాలకు కూడా వెళ్లారు. సంపూర్ణ అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతో పనులు చేపట్టారు. భగవంతుడి ఆశీస్సుల వల్ల అన్నీ అనుకున్నది అనుకున్నట్టు జరిగాయి.. అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: