తెలంగాణ ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న గ్లోబరీనా సంస్థ అరాచకాలు వివరిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌కు ఘాటు లేఖ రాశారు. బోర్డు ప్రకటించిన ఫలితాలు తప్పులతడకగా ఉండటంతో ఇప్పటి వరకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయారని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 


900 లకు పైగా మార్కులు సాధించిన సుమారు 10 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్టు రికార్డుల్లో చూపించారు. పలు జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు తెచ్చుకున్న కొందరు విద్యార్థులను ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయినట్టు చూపించారు. మొదటి సంవత్సరం అత్యున్నత మార్కులతో పాస్ అయిన విద్యార్థులను ద్వితియ సంవత్సరంలో ఫెయిల్ చేశారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. 

విద్యార్థుల డేటా సేకరణ, ఫలితాల క్రోడీకరణ బాధ్యతను అర్హతలేని కంపెనీకి అప్పగించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో కీలక వ్యక్తుల సిఫార్సుతోనే గ్లోబరీనా  టెక్నాలజీస్ అనే సంస్థకు ఈ కాంట్రాక్టు కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో కాకినాడ జెఎన్టీయూ విషయంలో ఇదే గ్లోబరీనా సంస్థ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2015లో ఈ సంస్థ నిర్వాకం పై మీరే స్వయంగా విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరుగుతోన్న అన్యాయం విషయంలో ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదు. ఇలాంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యతారాహిత్య ప్రకటనలతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఫలితాలలో తప్పులు జరిగాయని ఓ వైపు బోర్డు కార్యదర్శి అశోక్ అంగీకరిస్తుంటే... మరోవైపు ఇదంతా అపోహమాత్రమే అని మంత్రి కొట్టిపారేస్తున్నారు. 

రాష్ట్రంలోని యూనివర్సిటీలకు మీరు ఛాన్సిలర్. గాడితప్పిన విద్యావ్యవస్థను దారిలో పెట్టడానికి మీ జోక్యం అవసరం. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలతో మాట్లాడండి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పిలిపించుకుని మీరే స్వయంగా మాట్లాడండి అని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: