ఆంధ్రప్రదేశ్‌కు మరో పెను తుపాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హుద్ హుద్ తో పాటు అనేక తుపానులు కొన్నేళ్లుగా ఏపీని వణికించాయి. ఇప్పుడు మరో గండం ఏపీని అతలా కుతలం చేయబోతోందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 


ఈ తుపాను ఏపిలో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నాటికి వాయుగుండంగా మారినా శ్రీలంకకు దిగువున ఉన్నందున ఏపీలో వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొన్నారు. వాయువ్య దిశ నుండి వేడి గాలులు

తెలుగు రాష్ట్రాల మీదుగా వాయుగుండం వైపునకు బలంగా పయనించే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో వేడి పెరిగే అవకాశం ఉందన్నారు. 
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని భూమధ్యరేఖ మీదుగా గురువారం తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది శుక్రవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో తుపానుగా మారనుందని అధికారులు చెబుతున్నారు. 

ఈ తుపానుకు  ఫణి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. తుపాను ఈనెల 30న శ్రీలంక తీరాన్ని తాకి ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర వైపుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 29న తమిళనాడు తీరం, పుదుచ్చేరి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. 

ఈనెల 29, 30 తేదీల్లో కేరళ, దక్షిణాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయి. ఈనెల 30న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 90కి.మీ. నుంచి 115 కి.మీ. మేర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: