ఎన్నిక‌లు ముగిసిన ఏపీలో ఫ‌లితాల‌పై ఓ వైపు చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గానే మెజార్టీ స‌ర్వేలు వైసీపీ అధికారంలోకి రావ‌డం... వైఎస్‌.జ‌గ‌న్ సీఎం అవ్వ‌డం ఖాయ‌మ‌ని తీర్మానించేస్తున్నాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు అప్పుడే ఎవ‌రికి ఏ ప‌ద‌వులు ? అన్న విష‌యంపై కూడా ఎవ‌రికి వారు లెక్క‌లు వేసుకుంటున్నారు. జ‌గ‌న్ కోసం కాంగ్రెస్‌లో మంత్రి ప‌ద‌వులు వ‌దులుకున్న వారు కొంద‌రు అయితే... ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామాలు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లి రిస్క్ చేసిన వారు కూడా ఉన్నారు. ఇక జ‌గ‌న్ కోసం ప‌దేళ్ల పాటు చాలా మంది త్యాగాలు చేసినా వారంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం సాధ్యం కాదు. మ‌రి ఫైన‌ల్‌గా జ‌గ‌న్ మ‌న‌స్సులో ఎవ‌రు ?  ఉన్నారో ?  తెలియ‌దు కాని.. జ‌గ‌న్ మాత్రం ఓ ముగ్గురికి త‌న కేబినెట్‌లో చోటు ఇస్తున్న‌ట్టు ఓపెన్‌గానే చెప్పేశారు.


గుంటూరు జిల్లాలో చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డితో పాటు ఒంగోలు అభ్య‌ర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వులు ఇస్తున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇక జ‌గ‌న్ అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా చాలా జిల్లాల్లో ఉన్న ఈక్వేష‌న్లు కొంత‌మందికి బెర్త్‌లు ఖాయం అయ్యేలా క‌నిపిస్తున్నాయి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి కూడా జ‌గ‌న్ కేబినెట్‌లో ఇద్ద‌రికి సీట్లు రిజ‌ర్వ్ అయ్యాయ‌ని చెబుతున్నారు లోట‌స్ పాండ్ లోని జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా ఉన్న నాయ‌కులు. ఏలూరు  పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ ఆళ్ల‌ నానికి జ‌గ‌న్ మంత్రి ప‌దవిని ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. 


వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు అయిన ఆళ్ల నాని 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఓడిపోయినా జ‌గ‌న్ ఆయ‌న‌కు ఏలూరు జిల్లా ప‌గ్గాలు ఇవ్వ‌డంతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ప‌శ్చిమ‌లో ప‌క్కాగా కాపుల‌కు ఓ బెర్త్ ఉంటుంది. కాపుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్న జ‌గ‌న్‌.. ఆ కోటాలో నానికి బెర్త్ ఖ‌రారు చేయ‌నున్నారు. ఇక పోల‌వ‌రం ఎమ్మెల్యే అభ్య‌ర్థి తెల్లం బాల‌రాజుకు కూడా ఎస్టీ కోటాలో జ‌గ‌న్ బెర్త్ ఖ‌రారు చేశార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న హ్యాట్రిక్ కొట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడినా బాల‌రాజు ఈ ఎన్నిక‌ల్లో 20 వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించ‌నున్నారు. 


ఎస్టీ సామాజిక‌వ‌ర్గంలో మూడుసార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బాల‌రాజే. అది కూడా జ‌గ‌న్ కోసం ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దిలేసుకున్నారు. ఎస్టీ కోటాలో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం అంటే ముందుగా బాల‌రాజు పేరే ప్ర‌స్తావ‌న‌కు రానుంది. వైవి.సుబ్బారెడ్డి కూడా బాల‌రాజుకు మంత్రి ప‌ద‌వి విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుబ‌ట్టే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: